బెర్క్‌షైర్‌ హాత్‌వేకు భారీ నష్టం

Warren Buffetts Berkshire Hathaway Posts Huge Loss - Sakshi

ప్రపంచ కుబేరుడికీ మహమ్మారి ఎదురుదెబ్బ

న్యూయార్క్‌ : సంక్షోభాల్లో సంపదను సృష్టించే దార్శనికుడిగా పేరొందిన ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌కే కోవిడ్‌-19 ఎఫెక్ట్‌ కలవరపరుస్తోంది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలే సమయంలోనే కొనుగోళ్లకు దిగాలని సూచించే బఫెట్‌ వ్యూహం ఇప్పుడు తారుమారైంది. ప్రతికూల పరిస్థితుల్లోనే షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లను ప్రోత్సహించే బఫెట్‌ ఇప్పుడు తానే ఆచితూచి వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాణాంతక వైరస్‌ సెగ ప్రపంచ కుబేరుడినీ తాకింది. స్టాక్‌ ఇన్వెస్టర్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ (89)కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కరోనా మహమ్మారి ప్రభావంతో మూడు నెలల కాలానికి దాదాపు రూ 3.5 లక్షల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

తమ గ్రూపుకు సంబంధించి పలు వ్యాపారాలు మహమ్మారి ధాటికి నష్టాల బాట పట్టాయని బెర్క్‌షైర్‌ పేర్కొంది. 90కి పైగా తమ వ్యాపారాలు కోవిడ్‌-19 కారణంగా స్వల్ప నష్టాల నుంచి భారీ నష్టాలను చవిచూశాయని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బఫెట్‌ బిజినెస్‌ భారీగా దెబ్బతింది. సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడంతో కంపెనీ నగదు ప్రవాహం తగ్గడంతో భారీ టేకోవర్‌లను బఫెట్‌ పక్కనపెట్టినట్టు సమాచారం. మరోవైపు షేర్ల కొనుగోళ్లలోనూ ఆచితూచి వ్యవహరించాలని బెర్క్‌షైర్‌ హాత్‌వే నిర్ణయించింది.

చదవండి : ఇస్మార్ట్‌ బఫెట్‌

ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో కేవలం రూ 13,500 కోట్ల విలువైన షేర్లనే కొనుగోలు చేసినట్టు బెర్క్‌షైర్‌ పేర్కొంది. తమ కు సంబంధించిన సొంత షేర్లను రూ 12,000 కోట్లు వెచ్చించి తిరిగి కొనుగోలు చేశామని ఇది గత క్వార్టర్‌తో పోలిస్తే తక్కువ మొత్తమేనని తెలిపింది. సాధారణంగా సంక్షోభ సమయంలోనే మార్కెట్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను ప్రోత్సహించే బఫెట్‌ తనే సొంతంగా షేర్ల కొనుగోలును నిలిపివేయడంతో ఇక తామేం​ చేయాలని ఎడ్వర్డ్‌ జోన్స్‌ అండ్‌ కంపెనీకి చెందిన ఓ అనలిస్ట్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top