
న్యూఢిల్లీ: దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 77 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ డీల్ కోసం వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ మెగా డీల్‌ను ఈ ఏడాది మేలో ప్రకటించారు. ‘ఇన్వెస్ట్‌మెంట్ పూర్తి కావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు దాదాపు 77% వాటాలు లభించాయి. మిగతా వాటా ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, టెన్సెంట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైన ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటుంది‘ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ.. రెండు సంస్థలూ వేర్వేరు బ్రాండ్స్‌గానే కొనసాగనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్ సారథ్యంలోనే ఉంటుంది. వాల్‌మార్ట్‌కి చెందిన అధికారులు ఫ్లిప్‌కార్ట్ బోర్డులో చేరతారు. ఇకపై ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక ఫలితాలను వాల్‌మార్ట్ అంతర్జాతీయ వ్యాపార ఫలితాల్లో చేర్చనున్నారు. నాణ్యమైన, చౌక ఉత్పత్తులను సమకూర్చడం ద్వారా ఈ డీల్ భారత్‌కు తోడ్పడగలదని, అలాగే కొత్తగా ఉపాధి కల్పనకు.. సరఫరాదారులకు వ్యాపార అవకాశాలు కల్పించగలదని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ జూడిత్ మెకెన్నా తెలిపారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 21 హోల్‌సేల్ స్టోర్స్ ఉన్నాయి.