
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో తాము ఇక ముందూ దూకుడుగా వెళతామని వాల్‌మార్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జెరెమీ కింగ్ చెప్పారు. తమ విస్తరణ కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. భారత్‌లో అతిపెద్ద టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్... అమెజాన్‌కు పోటీగా దేశీయంగా అగ్రస్థానంలో ఉన్న ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిపై ఆయన నేరుగా స్పందించలేదు. తమ విధానం కొనసాగుతుందంటూనే, ఇప్పటి వరకు 13 కంపెనీలను కొనుగోలు చేశామని, బెంగళూరులోనూ అలా చేయడాన్ని ఇష్టపడతామని చెప్పారు. వచ్చే ఏడాది, ఆపై కాలంలో మూడు నుంచి ఐదు స్టార్టప్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అమెరికాలో తమకు విజయాన్నందించిన ఈ మోడల్ ప్రకారం... బెంగళూరులో ఎన్ని స్టార్టప్‌ల కొనుగోలుకు అవకాశం లభిస్తుందో చూడాలని చెప్పారాయన. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కొనుగోళ్ల ద్వారా విస్తరణ
అంతర్జాతీయంగా అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌గా ఉన్న అమెజాన్‌తో ఉన్న అంతరాన్ని పూడ్చుకుని అగ్ర స్థానానికి చేరుకునేందుకు గత ఐదేళ్లలో తన ఈ కామర్స్ వ్యాపారంపై బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించింది. దీన్లో భాగంగా 2016లో అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైలర్ జెట్ డాట్ కామ్‌ను 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అదే ఏడాది చైనాకు చెందిన రెండో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ జేడీ డాట్‌కామ్‌లో 5 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ద్వారా తమకు మంచి వ్యాపార నైపుణ్యం అందుబాటులోకి వచ్చినట్టు కింగ్ వెల్లడించారు. రానున్న సంవత్సరాల్లోనూ ఈ కామర్స్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళతామని, దీనికి భారత్‌లోని టెక్నాలజీ కేంద్రం కీలకమని చెప్పారు. భారత్‌ను టెక్నాలజీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అమెరికాలోని ఆర్కాన్సాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, బెంగళూరులో తమకు పటిష్ట టెక్నాలజీ కేంద్రాలున్నాయని చెప్పిన కింగ్... బెంగళూరు కేంద్రం మరింత వృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఆకాంక్ష అయితే చాలా బలంగా ఉందని, తమ విధానం, ఉత్పత్తు్తలకు సరిపోలే, టాలెంట్‌తో కూడిన స్టార్టప్‌లను గుర్తించడమే కీలకమని వాల్‌మార్ట్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ హరి వాసుదేవ్ చెప్పారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అమెజాన్ వాటా 43 శాతం కాగా, వాల్‌మార్ట్ వాటా 4 శాతంలోపే ఉంది.