వొడాఫోన్‌ ఐడియా నష్టం 4,882 కోట్లు 

Vodafone Idea lost Rs 4,882 crore - Sakshi

న్యూఢిల్లీ: దేశీ టెలికం మార్కెట్లో టారిఫ్‌ల పరంగా తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.4,882 కోట్ల నష్టం ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే మూడో క్వార్టర్‌లో నమోదైన రూ.5,005 కోట్లతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు గతేడాది ఆగస్టులో విలీనం కావడంతో అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో ఫలితాలను పోల్చి చూడటానికి లేదు. 2018–19 మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 11,765 కోట్లు కాగా, నాలుగో త్రైమాసికంలో దాదాపు అదే స్థాయిలో రూ.11,775 కోట్లుగా నమోదైంది. విలీనానంతరం అమలు చేస్తున్న నిర్ణయాలు క్రమంగా సానుకూల ఫలితాలిస్తున్నాయని, రెండేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వొడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేష్‌ శర్మ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 37,092 కోట్లు కాగా, నష్టం రూ. 14,604 కోట్లు. ఒక్కో యూజరుపై సగటు ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే 16.3 శాతం పెరిగి రూ.104కి చేరింది. క్యూ3లో ఇది రూ.89గా ఉంది. సంస్థ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేరు 3% పెరిగి రూ.14.45 వద్ద క్లోజయ్యింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top