విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ

Vijay Mallya Will Have To Pay Rs 1.5cr More For Banks Legal - Sakshi

లండన్‌ : భారత్‌, యూకేలో పలు న్యాయ కేసులను ఎదుర్కొంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బ్యాంకుల కన్సోర్టియంకు లీగల్‌ ఫీజుల కింద రూ.1.5 కోట్లను చెల్లించాలని లండన్‌ హైకోర్టు విజయ్‌ మాల్యాను ఆదేశించింది. బ్యాంకులకు వ్యతిరేకంగా అతను నమోదు చేసిన కేసు కొట్టివేసిన అనంతరం వారి లీగల్‌ ఫీజులు వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన విజయ్‌ మాల్యాను ప్రస్తుతం భారత్‌కు అప్పగించే ప్రక్రియపై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతుంది. మాల్యా ఇప్పటికే లీగల్‌ ఫీజుల కింద రూ.1.8 కోట్లను చెల్లించారు. 

తాజాగా మరో రూ.1.5 కోట్లను చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా ఈ కేసులో బ్యాంకులకు రూ.3.3 కోట్లను మాల్యా చెల్లిస్తున్నారు. బ్యాంకుల న్యాయ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, మొదటి ప్రతివాది (మాల్యా) 2,00,000 పౌండ్లు(రూ.1.8కోట్లు) చెల్లింపులు చేశారు. 60 రోజుల లోపు మరో 1,75,000 పౌండ్లను చెల్లించి, తుది పరిష్కారం పొందుతారు అని జడ్జి వాక్స్‌మ్యాన్‌ క్యూసీ చెప్పారు. ప్రస్తుతం అతను బ్యాంక్‌లతో రాజీకి వస్తున్నారని తెలిసింది. కాగ గత నెల చివరిన మాల్యాను భారత్‌కు అప్పగింతపై తుది విచారణ జరిగింది. బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై వస్తున్న మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top