ఈ ఏడాది మరింత బాగుంటుంది | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మరింత బాగుంటుంది

Published Fri, Jul 3 2015 1:12 AM

ఈ ఏడాది మరింత బాగుంటుంది

ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య
 
 ముంబై : ఆర్థిక వ్యవస్థలో ఒక మోస్తరు రికవరీ ఇప్పటికే కనిపిస్తున్నందున క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగ్గా ఉండగలదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతి భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికోత్పత్తి క్రమంగా ఊపందుకుంటూ ఉండటంతో పాటు సంస్కరణలకు అనుకూల విధానాలు.. ఆశించిన ఫలితాలను సాధించేందుకు తోడ్పాటు అందించగలవని గురువారం సంస్థ షేర్‌హోల్డర్లకు ఆమె తెలిపారు. అటు ద్రవ్యోల్బణపరమైన ఒత్తిళ్లు తగ్గుతున్నందున దేశీయంగా డిమాండ్‌ను పెంచేందుకు మరింత ఉద్దీపన లభించే అవకాశాలు ఉన్నట్లు భట్టాచార్య పేర్కొన్నారు.

జూన్‌లో వర్షాలు తగినంత స్థాయిలో ఉన్నందున వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు తగ్గొచ్చన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు రికవర్ అవుతున్నందున ఎగుమతులు పెరగడం, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఏర్పడటం వంటివి అధిక వృద్ధికి దోహదపడే సానుకూల అంశాలని ఆమె చెప్పారు. 2013 అక్టోబర్‌లో ఎస్‌బీఐ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు.. మొండిబకాయిలు తగ్గించడం, రిస్కు మేనేజ్‌మెంట్, వ్యయాల నియంత్రణ, మెరుగైన ప్రమాణాలు నెలకొల్పడం, అధిక వడ్డీయేతర ఆదాయ ఆర్జన, సమర్ధంగా టెక్నాలజీని వినియోగించుకోవడం అనే ఆరు లక్ష్యాలను నిర్దేశించుకోగా.. గణనీయమైన పురోగతే సాధించగలిగామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికర మొండిబకాయిలు (ఎన్‌పీఏ) రూ. 3,505 కోట్ల మేర తగ్గి రూ. 27,591 కోట్లకు పరిమితమయ్యాయని భట్టాచార్య వివరించారు. ఎన్‌పీఏల నుంచి రికవరీలు 32.33 శాతం మేర పెరిగాయని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement