ఇక డ్రోన్స్‌తో ఫుడ్‌ డెలివరీ!

Swiggy And Zomato cleared to test long-range delivery Drones - Sakshi

పరీక్షలకు డీజీసీఏ అనుమతులు

జూలై తొలివారంలో టెస్టింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు

జొమాటో, స్విగ్గీ, డుంజో తదితర కంపెనీలు

న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్‌ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్‌వోఎస్‌ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులిచ్చింది.  ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దన్నుగా ఉన్న డ్రోన్‌ స్టార్టప్‌ ఆస్టీరియా ఏరోస్పేస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్‌ 30 నాటికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్‌ టైమ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్‌ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌కు ఇది తొలి అడుగు కానుంది.  

గతేడాది నుంచే ప్రయత్నాలు ..
సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్‌ ఫ్లయిట్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్‌ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్‌తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్‌ అధిగమించినట్లు గోయల్‌ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్‌కు ఫుడ్‌ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్‌ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్‌ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్‌ స్టార్టప్‌ సంస్థ టెక్‌ఈగిల్‌ను కూడా కొనుగోలు చేసింది.  డ్రోన్‌ ట్రయల్స్‌కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మే నెలలో వెల్లడించింది.

అనుమతి తప్పనిసరి...
డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్‌ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top