మార్కెట్లోకి స్వరాజ్ 60 హెచ్‌పీ ట్రాక్టర్ | Swaraj 60 HP tractor into the market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి స్వరాజ్ 60 హెచ్‌పీ ట్రాక్టర్

Aug 29 2015 12:28 AM | Updated on Sep 3 2017 8:18 AM

మార్కెట్లోకి స్వరాజ్ 60 హెచ్‌పీ ట్రాక్టర్

మార్కెట్లోకి స్వరాజ్ 60 హెచ్‌పీ ట్రాక్టర్

ట్రాక్టర్ల తయారీ దిగ్గజం స్వరాజ్ 60 హెచ్‌పీ విభాగంలోకి ప్రవేశించింది. 960 ఎఫ్‌ఈ పేరుతో కొత్త ట్రాక్టర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది

రెండేళ్లలో మరో రెండు మోడళ్లు
♦ 2015-16లో 5 శాతం వృద్ధి అంచనా
♦ స్వరాజ్ సేల్స్ ఎస్‌వీపీ రాజీవ్ రెల్లన్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్ల తయారీ దిగ్గజం స్వరాజ్ 60 హెచ్‌పీ విభాగంలోకి ప్రవేశించింది. 960 ఎఫ్‌ఈ పేరుతో కొత్త ట్రాక్టర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 3,478 సీసీ 3 సిలిండర్ ఇంజన్‌ను దీన్లో వాడారు. 60 హెచ్‌పీ ట్రాక్టర్లలో ఇంత సామర్థ్యం గల ఇంజన్‌ను వాడడం ఇదే తొలిసారి. 2,000 కిలోల బరువును సులువుగా ఎత్తగలదు. సైడ్ షిఫ్ట్ మెకానిజంతో 8 ఫార్వర్డ్, 2 రివర్స్ గేర్లున్నాయి. 12 అంగుళాల పెద్ద క్లచ్‌ను వాడారు. వేరియంట్‌ను బట్టి ఎక్స్ షోరూం ధర రూ.7.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ట్రాక్టర్ బరువు 2,330 కిలోలు. 30 ముఖ్యమైన ఫీచర్లను దీనికి జోడించామని స్వరాజ్ ట్రాక్టర్స్ సేల్స్ ఎస్‌వీపీ రాజీవ్ రెల్లన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ట్రాక్టర్‌ను పూర్తిగా దేశీయంగా తయారు చేశామన్నారు.  

 అధిక సామర్థ్యంతో..: మహీంద్రా గ్రూప్‌కు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ ఇప్పటి వరకు 50 హెచ్‌పీ సామర్థ్యానికే పరిమితమయ్యాయి. అధిక సామర్థ్యం గల ట్రాక్టర్లను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా 60 హెచ్‌పీలోకి ప్రవేశించిన ఈ సంస్థ... వచ్చే రెండేళ్లలో మరో రెండు మోడళ్లను తేనుంది. వీటిలో 65 హెచ్‌పీ మోడల్ కూడా ఉండబోతోంది. ఈ మోడళ్లను కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనుంది. మహీంద్రా, స్వరాజ్‌లకు సంయుక్తంగాట్రాక్టర్ల మార్కెట్లో 40% వాటా ఉందని కస్టమర్ కేర్ సీనియర్ జీఎం ఆర్.సి.శర్మ చెప్పారు. జహీరాబాద్ ప్లాంటులో ట్రాక్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.

 5 శాతం వృద్ధి అంచనా..: దేశవ్యాప్తంగా 2014-15లో 5.51 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4-5% వృద్ధిని పరిశ్రమ ఆశిస్తోంది. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూలైలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ 3% తగ్గింది. దేశవ్యాప్తంగా ఈ కాలంలో అమ్మకాలు 14% తగ్గటం ఇక్కడ గమనార్హం. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే వర్షాభావ పరిస్థితులున్నాయని, ఆశించిన వృద్ధి ఉంటుందని రాజీవ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement