స్టాక్స్‌ వ్యూ

Stocks view - Sakshi

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ప్రస్తుత ధర: రూ.1,621    
టార్గెట్‌ ధర: రూ.2,025
ఎందుకంటే: 
ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో మంచి వృద్ధినే కనబరిచింది. అదే జోరు రెండో క్వార్టర్‌లో కూడా కొనసాగవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కంపెనీ వృద్ధి అధికంగా ఉండనున్నది.  పట్టణ అమ్మకాల కంటే గ్రామీణ అమ్మకాలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటాయని అంచనా. విలువ పరంగా చూస్తే 1.3 రెట్లు అధికంగా ఉండొచ్చు. ఈ క్యూ2లో చోటు చేసుకున్న రవాణా సమ్మె, కేరళ వరదలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవచ్చు. ఈ రెండు సమస్యల కారణంగా సరఫరా చైన్‌లో తలెత్తిన సమస్యలు పూర్తిగా సమసిపోయాయని చెప్పవచ్చు.

రెండేళ్లలో అమ్మకాలు 6–8% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని కంపెనీ ధీమాగా ఉంది. ప్రకటనల కోసం అధికంగా వ్యయం చేస్తోంది. ఉత్పత్తుల ధరల పెంపు, వ్యయ నియంత్రణ  పద్ధతుల ద్వారా ఈ అధిక ప్రకటనల వ్యయ భారాన్ని తట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో కొన్ని ఉత్పత్తుల ధరలను ఈ కంపెనీ 3–4% రేంజ్‌లో పెంచింది. ఆ ప్రభావం క్యూ2 ఆర్థిక ఫలితాల్లో కనిపించవచ్చు. ఆయుష్, ఇందులేఖలతో పాటు లక్స్, హమామ్, లైఫ్‌బాయ్‌ బ్రాండ్‌లలో అందుబాటులోకి తెచ్చిన నేచురల్‌ వేరియంట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి.

‘విన్నింగ్‌ మెనీ ఇండియాస్‌’ వ్యూహంలో  వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఉత్పత్తులను అందిస్తోంది. అవసరమైన టెక్నాలజీని అవసరమైన స్థాయిలో వినియోగిస్తోంది.   జీఎస్‌టీ   అమల్లోకి వస్తే, అసంఘటిత రంగం నుంచి మార్కెట్‌ సంఘటిత రంగానికి మళ్లుతుందనే భావన ఉండేది. అయితే జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అసంఘటిత రంగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో  మార్కెట్‌ సంఘటిత రంగానికి మళ్లలేదని చెప్పవచ్చు. దీనికి తోడు పోటీ తీవ్రత కొనసాగుతుండటం, అధిక ప్రకటనల వ్యయాల కారణంగా నిర్వహణ మార్జిన్లపై ప్రభావం పడనుండటం.. ప్రతికూలాంశాలు.  

హీరో మోటొకార్ప్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: సెంట్రమ్‌ బ్రోకింగ్‌
ప్రస్తుత ధర: రూ.3,166     టార్గెట్‌ ధర: రూ.4,009
ఎందుకంటే:
ఈ కంపెనీ ఇటీవలనే 200 సీసీ కేటగిరిలో ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  ప్రీమియమ్‌ బైక్‌ సెగ్మెంట్లోకి ఈ బైక్‌ ద్వారా ఈ కంపెనీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. రూ. 89,900(ఎక్స్‌ షోరూమ్‌)  ధర గల ఈ బైక్‌ కారణంగా ఈ షేర్‌ ధర రీరేట్‌ కాగలదని భావిస్తున్నాం. ఈ సెగ్మెంట్లో అత్యంత చౌక అయిన బైక్‌ ఇదే. ఈ బైక్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది.  కంపెనీ బ్రాండ్‌ పటిష్టంగా ఉండటం, ధర చౌకగా ఉండటం వంటి కారణాల వల్ల మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్‌ బైక్‌ సెగ్మెంట్లో ఈ బైక్‌తో కొంత మార్కెట్‌ వాటాను ఈ కంపెనీ కొల్లగొట్టగలదని భావిస్తున్నాం.

బజాజ్‌ ఆటో కంపెనీకి చెందిన పల్సర్‌ ఎన్‌ఎస్‌ 200, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీకి చెందిన ఆపాచీ ఆర్‌టీఆర్‌ 300, ఎన్‌వీ బైక్‌ల ధరలతో పోల్చితే ఈ ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ బైక్‌ ధర 20–40% తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ఇక ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ బైక్‌ ధర లభించే స్థాయిల్లోనే ఉన్న ఇతర కంపెనీల 150సీసీ–180 సీసీ బైక్‌లతో పోల్చితే సౌకర్యాలు, ఫీచర్లు ఎక్స్‌ట్రీమ్‌ 200ఆర్‌ బైక్‌లోనే అధికంగా ఉన్నాయి.

దీంతో ప్రస్తుతం 100–125 సీసీ బైక్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు తదుపరి అప్‌గ్రేడ్‌ కోసం ఈ బైక్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  ఇటీవలే తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కోహ్లితో బ్రాండింగ్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకుంటుండటం... సానుకూలాంశాలు.  

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top