త్వరలో భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ

Soon India Dynamics IPO - Sakshi

వరుసలో ఐఆర్‌ఈడీఏ కూడా

ఈ రెండు ఐపీఓలకు సెబీ ఆమోదం  

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఈ కంపెనీతో పాటు మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈడీఏ(ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) కూడా ఐపీఓకు రానున్నది. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవలనే ఆమోదం తెలిపింది.

భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ@:  రూ.1,000 కోట్లు  
1970లో ప్రారంభమైన భారత్‌ డైనమిక్స్‌ కంపెనీ క్షిపణులను , ఇతర రక్షణ సాధనాలను తయారు చేస్తోంది. ఐపీఓలో భాగంగా 13 శాతం వాటాకు సమానమైన 2.2 కోట్ల షేర్లను జారీ చేయనున్నది.  ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. గత ఏడాది మార్చి నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ రూ.2,212 కోట్లుగా ఉంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, యస్‌  సెక్యూరిటీస్‌ సంస్థలు ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.  

ఐఆర్‌ఈడీఏ సమీకరణ... రూ.900 కోట్లు  
ఇక ఐఆర్‌ఈడీఏ ఐపీఓలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 13.90 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. అర్హులైన ఉద్యోగులకు 6.95 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్‌ చేశారు. ఇష్యూ సైజ్‌ రూ.850–900 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాలని ఈ కంపెనీ యోచిస్తోంది.

లిస్టింగ్‌ తర్వాత ప్రస్తుతం రూ.784 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ చెల్లించిన మూల ధనం రూ.923 కోట్లకు పెరుగుతుంది. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థగా ఈ కంపెనీ 1987 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ఐపీఓకు యస్‌  సెక్యూరిటీస్‌(ఇండియా), ఎలార క్యాపిటల్‌(ఇండియా), ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top