నైపుణ్య శిక్షణకు ఎంఎన్‌సీలతో భాగస్వామ్యం | Skill training to share MNC | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణకు ఎంఎన్‌సీలతో భాగస్వామ్యం

Dec 20 2014 12:45 AM | Updated on Sep 2 2017 6:26 PM

నైపుణ్య శిక్షణకు ఎంఎన్‌సీలతో భాగస్వామ్యం

నైపుణ్య శిక్షణకు ఎంఎన్‌సీలతో భాగస్వామ్యం

వివిధ రంగాలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఎంఎన్‌సీ..

ఎన్‌ఎస్‌డీసీ ఎండీ దిలీప్ షెనాయ్
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఎంఎన్‌సీ(బహుళజాతి కంపెనీలు)లతో చేతులు కలుపుతున్నట్టు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) తెలిపింది. ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఎయిర్‌టెల్, సేఫ్ ఎక్స్‌ప్రెస్ వంటి 20కిపైగా దిగ్గజాలతో ఇప్పటికే భాగస్వామ్యం కుదిరిందని ఎన్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. వచ్చే ఏడాదికల్లా మరో 25 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటామని వెల్లడించారు. అభ్యర్థులకు నేరుగా కంపెనీల్లో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా 160కి పైగా కంపెనీలు, శిక్షణ సంస్థలు, విద్యాలయాలతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ పనిచేస్తోందన్నారు.
 
కొత్త రంగాల్లో..
సోలార్ ఎనర్జీ, నీటి, వ్యర్థాల నిర్వహణ వంటి కొత్త రంగాల్లో నిపుణుల అవసరం రానున్న రోజుల్లో గణనీయంగా ఉండనుంది. ఇందుకు అనుగుణంగా పరిశ్రమకు కావాల్సిన నిపుణుల తయారీలో ఎన్‌ఎస్‌డీసీ నిమగ్నమైందని దిలీప్ షెనాయ్ వెల్లడించారు. విదేశాల్లోనూ పనిచేయగలిగేలా శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం యూకే కమిషన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్స్ వంటి సంస్థల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘2022 నాటికి దేశీయంగా కొత్తగా 35 కోట్ల మంది నిపుణులు అవసరమని ఎన్‌ఎస్‌డీసీ అధ్యయనంలో తేలింది. 2014లో దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య రెండింతలు కానుంది’ అని తెలిపారు.
 
చేతులు కలిపిన స్కిల్‌ప్రో..
నైపుణ్య శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్ కంపెనీ స్కిల్‌ప్రో ఎన్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌డీసీ సుమారు రూ.18 కోట్లను రుణంగా ఇస్తుంది. తద్వారా 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు వీలవుతుందని స్కిల్‌ప్రో చైర్మన్ అనంత్‌రావు ఈ సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా మూడేళ్లలో 220 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 48 వేల మంది తమ కేంద్రాల్లో శిక్షణ పొందారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement