కకావికలం

Share Market Update: Sensex Trades At 38,297 Points With Loss Of 1,448 Points - Sakshi

57 దేశాలకు పాకిన కోవిడ్‌–19 వైరస్‌

మందగమనం మాంద్యంగా మారుతుందనే భయాలు

కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు

మన మార్కెట్లో కొనసాగుతున్న విదేశీ అమ్మకాలు

50 పైసలకు పైగా పడిపోయిన రూపాయి

కీలక మద్దతులను కోల్పోయిన దేశీ సూచీలు...

1,448 పాయింట్ల నష్టంతో 38,297కు సెన్సెక్స్‌

సెన్సెక్స్‌కు ఇదే రెండో అతి పెద్ద నష్టం

432 పాయింట్లు తగ్గి 11,202కు నిఫ్టీ

కరోనా ముసలం...
కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ ప్రపంచమంతా పాకుతుండటంతో అంతర్జాతీయ వృద్ధిపై భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతమున్న ఆర్థిక మందగమనం కోవిడ్‌ వైరస్‌ కారణంగా మాంద్యంగా పరిణమిస్తుందనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన మార్కెట్‌ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతులన్నింటినీ కోల్పోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 3.64 శాతం, నిఫ్టీ 3.71 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనం. 2015, ఆగస్టు 24 వ తేదీన సెన్సెక్స్‌ అత్యధికంగా 1,625 పాయింట్లు నష్టపోయింది.

ఆరో రోజూ నష్టాలే...: సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఆరో రోజూ క్షీణించాయి. ఈ రెండు సూచీలు నాలుగున్నర నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇక ఈ వారంలో సెన్సెక్స్‌ 2,873 పాయింట్లు, నిఫ్టీ 879 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.  శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 6.9%, నిఫ్టీ 7.2% పడ్డాయి

ఎదురీదిన ఐటీసీ  
►మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో ఐటీసీ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా 8 శాతం, టాటా స్టీల్‌ 7.5 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 7.5 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 7 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 6 శాతం, ఇన్ఫోసిస్‌ 6 శాతం చొప్పున పతనమయ్యాయి.  
►400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అపోలో టైర్స్, బంధన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హీరో మోటొ, గెయిల్, కోల్‌ ఇండియా, విప్రో, మహీంద్రా, వేదాంత, ఎల్‌ అండ్‌ టీ, ఓఎన్‌జీసీ, లుపిన్, టాటా పవర్, హెచ్‌పీసీఎల్, పీఎన్‌బీ తదితర షేర్లు  జాబితాలో ఉన్నాయి.  
►మిధాని, డీఐసీ ఇండియా తదితర 30 పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు ఎగిశాయి.
►300కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్, శంకర బిల్డింగ్స్‌ ప్రొడక్టŠస్, రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ పవర్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్, రుచి సోయా, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ తదితర షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి.

పతనానికి ప్రధాన కారణాలు...
►వైరస్‌ విలయం...  
మొన్నమొన్నటిదాకా 30 దేశాలకే పరిమితమైన కోవిడ్‌–19 వైరస్‌ ఇప్పుడు మొత్తం ఆరు ఖండాల్లోని 57 దేశాలకు పాకింది.  చైనాలో కొత్త కేసులు, కోవిడ్‌ వైరస్‌ బాధితుల మరణాలు తగ్గినప్పటికీ, న్యూజిలాండ్, నైజీరియా, అజర్‌బైజాన్, నెదర్లాండ్స్‌ దేశాల్లో కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ వైరస్‌ సోకిన వారి సంఖ్య 80,000కు, మరణాల సంఖ్య 2,900కు చేరింది.

►ప్రపంచ మార్కెట్ల పతనం  
కోవిడ్‌–19 వైరస్‌ భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఒక వారం పాటు ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మళ్లీ ఈ ఏడాది ఈ వారంలో అదే స్థాయి నష్టాలు వాటిల్లాయి. శుక్రవారం షాంఘై, హాంగ్‌సెంగ్, సియోల్, టోక్యో సూచీలు 2–4  శాతం వరకూ నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు ఆరంభంలోనే 4% క్షీణించాయి. గురువారం అమెరికా స్టాక్‌ సూచీ, డో జోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 1,191 పాయింట్లు పతనమైంది. డోజోన్స్‌ చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో డోజోన్స్‌ మొత్తం 3,581 పాయింట్లు (12%) మేర క్షీణించింది.

►విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు  
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రమారమి రూ.10,000 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం మన దేశంపై లేనప్పటికీ, ప్రపంచ మార్కెట్ల పతనం కొనసాగితే, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా జరుగుతుందని నిపుణులంటున్నారు.

►ముడి చమురు ధరల పతనం  
కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించి చమురుకు డిమాండ్‌ తగ్గుతుందనే అంచనాలతో ముడి చమురు ధరలు 3.3 శాతం మేర నష్టపోయాయి. సాధారణంగా ముడి చమురు ధరలు పతనమైతే, మన మార్కెట్‌ లాభపడాలి. కానీ మాంద్యం భయాలతో ముడి చమురు ధరలు పడిపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావమే చూపించింది.

►రూపాయి డౌన్‌
డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు క్షీణించి 72.16కు చేరడం కూడా స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల జోరుకు ఒక కారణమైంది.

పతనం ఇక్కడితో ఆగుతుందా ? 
స్టాక్‌ మార్కెట్‌ తదుపరి గమనంపై విశ్లేషకులు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మన మార్కెట్‌ అంతర్జాతీయ సంకేతాలపై అధికంగా ఆధారపడుతోందని, ప్రపంచ మార్కెట్లు పతనమవుతుండటంతో ప్రస్తుతానికి మార్కెట్‌కు దూరంగానే ఉంటే మంచిందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ప్రతి పతనం కొనుగోలుకు మంచి అవకాశమని మరికొందరంటున్నారు.

వచ్చే వారం పుల్‌బ్యాక్‌ ర్యాలీ...!
మార్కెట్‌ ఇక్కడ స్థిరపడటానికి ఇది మంచి అవకాశమని ట్రేడింగ్‌బుల్స్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ సంతోష్‌ మీనా పేర్కొన్నారు. వచ్చే వారం పుల్‌బ్యాక్‌ ర్యాలీకి అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. 200 రోజుల చలన సగటు(డీఎమ్‌ఏ)–11,687 పాయింట్లకు నిఫ్టీ చేరవచ్చని తెలిపారు. మద్దతు స్థాయిలు 11,200–11,100 పాయింట్లని, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించినప్పుడు నిఫ్టీ ఇక్కడినుంచే ర్యాలీ జరిపిందన్నారు. ఒకవేళ నిఫ్టీ 11,100 పాయింట్ల దిగువకు పడిపోతే నిఫ్టీ తదుపరి మద్దతు 10,700 పాయింట్లని పేర్కొన్నారు.

పెట్టుబడులకు ఇదే మంచి తరుణమా..?
కాగా కరోనా విలయం ప్రపంచ మార్కెట్లపై మరింతగానే ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. మన దేశంలో కోవిడ్‌–19 వైరస్‌ కేసులు ఏమీ నమోదు కాలేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశం ఒకింత ఉత్తమ స్థాయిలోనే ఉందని మేబ్యాంక్‌ కిమ్‌ యంగ్‌ సెక్యూరిటీస్‌ సీఈఓ జిగర్‌ షా వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న షేర్లలో మదుపు చేయడానికి ఇదే మంచి తరుణమని సూచించారు. ఎగుమతులపై భారత్‌ అధికంగా చైనాపై అధారపడి ఉందని, అందుకని కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని డాల్టన్‌ క్యాపిటల్‌ ఎనలిస్ట్‌ యూ.ఆర్‌. భట్‌ చెప్పారు.

మరో రూ.5.5 లక్షల కోట్లు హుష్‌
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.45 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.5.45,453 కోట్లు క్షీణించి రూ.1.46,94,572 కోట్లకు పడిపోయింది. గత ఆరు రోజుల్లో మొత్తం రూ.11,76,986 కోట్ల సంపద హరించుకుపోయింది.

భారీగా తగ్గిన పసిడి ధర 
అంతర్జాతీయంగా ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం భారీగా దిగివచ్చింది. కేవలం రెండు రోజుల క్రితం 1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి, ఈ వార్త రాసే 10.30 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో (గురువారం ముగింపుతో పోల్చి)1,594 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఒక దశలో 1,575 డాలర్లకు పడిపోవడం గమనార్హం. ఇక క్రూడ్‌ విషయానికి వస్తే, ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్‌ క్రూడ్‌ బ్యారల్‌ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఇది కోవిడ్‌ వైరస్‌ భయాలు త్వరలో ఉపశమిస్తున్నాయనడానికి సంకేతమా? అన్నది కొన్ని వర్గాల విశ్లేషణ.

కోవిడ్‌–19 వైరస్‌ కొత్త దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్స్‌పోజర్‌ ఉన్న లోహ, ఐటీ షేర్లు అధికంగా పతనమయ్యాయి. ఈ వైరస్‌ ఆర్థికంగా  ఏ మేరకు ప్రభావం చూపగలదో అనే విషయమై స్పష్టత లేనప్పటికీ, వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ప్రభావం తీవ్రంగానే ఉండగలదు.
–వినోద్‌ నాయర్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top