జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు?

SFIO probe likely into Jet Airways' 'fund diversion' - Sakshi

కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశం

నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన ఆర్‌వోసీ  

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి.

ఆర్‌వోసీ ముంబై విభాగం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్‌ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్‌ఎఫ్‌ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి.

అరవింద్‌ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్‌  ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్‌ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్, జెట్‌లైట్‌ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్‌వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్‌ఎఫ్‌ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్‌ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్‌ గుప్తాయే కావడం గమనార్హం.  

వేలానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యాలయం
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో వెల్లడించింది. 52,775 చ.అ. విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ గోద్రెజ్‌ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది. ఇప్పటికే జెట్‌ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న రుణదాతలు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్‌నర్స్, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top