
ముంబై : గ్లోబల్‌గా బలహీనమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలు పాలయ్యాయి. సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంలో 34,047 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంలో 10,458 వద్ద స్థిరపడ్డాయి. నేటి మార్కెట్‌లో బ్యాంకు, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లు ఎక్కువగా మార్కెట్లను దెబ్బతీశాయి. జీడీపీ వృద్ధి డేటా ఆశాజనకంగానే విడుదలైనప్పటికీ, గ్లోబల్‌గా మాత్రం సెంటిమెంట్ బలహీనంగా ఉండటం మార్కెట్లను దెబ్బకొట్టింది.
గురువారం ట్రేడింగ్‌లో ఆసియన్ మార్కెట్లన్నీ దాదాపు నష్టాలే గడించాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుందనే అంచనాలు మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు మూడూ రోజుల పాటు మార్కెట్లకు సెలవు ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, అరబిందో ఫార్మాలు టాప్ గెయినర్లుగా ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ టాప్ లూజర్లుగా ఉన్నాయి.