సెంబ్‌కార్ప్‌కు ఎన్‌సీసీ పవర్ | Sembcorp to have 55 percent share in ncc power project | Sakshi
Sakshi News home page

సెంబ్‌కార్ప్‌కు ఎన్‌సీసీ పవర్

Nov 29 2013 12:21 AM | Updated on Sep 4 2018 5:07 PM

సెంబ్‌కార్ప్‌కు ఎన్‌సీసీ పవర్ - Sakshi

సెంబ్‌కార్ప్‌కు ఎన్‌సీసీ పవర్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఎన్‌సీసీ పవర్ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ దక్కించుకుంటోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఎన్‌సీసీ పవర్ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ దక్కించుకుంటోంది. దీన్లో ఎన్‌సీసీకి చెందిన 55% వాటాను రూ.460 కోట్లకు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,320 మెగావాట్ల ఈ విద్యుత్ ప్రాజెక్టులో 55% వాటా నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన ఎన్‌సీసీ చేతిలో ఉండగా... మిగిలిన 45% ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ చేతిలో ఉంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ముత్తుకూరు వద్ద నిర్మిస్తున్న ఈ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా 35% పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు మొత్తం రూ.1,800 కోట్ల రుణభారం ఉందని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహనపై ఇరు సంస్థలూ బుధవారం సంతకాలు చేశాయని, మిగతా వ్యవహారాలన్నీ అనుకున్నట్లు పూర్తయితే డిసెంబర్ నెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు.
 ఒకవైపు వ్యయం పెరిగిపోవటం, రూపాయి క్షీణించటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్‌సీసీ ఇన్వెస్ట్ చేసిన రూ.460 కోట్లను తిరిగి చెల్లించటం ద్వారా దాని వాటాను సొంతం చేసుకోవటానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చిందని, ముఖ్యంగా రుణభారం తగ్గుతుంది కనుక వాటా విక్రయానికి ఎన్‌సీసీ మొగ్గు చూపిందని తెలియవచ్చింది. ఈ ఒప్పందానికి అమర్‌చంద్ అండ్ మంగళదాస్ న్యాయ సేవలు అందిస్తుండగా, కేపీఎంజీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలను అందిస్తోంది. రూ.7,047 కోట్ల పెట్టుబడి అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్‌సీసీ తన వాటా కింద రూ.960 కోట్లు సమకూర్చాల్సి ఉండగా ఇంతవరకు రూ.460 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ప్రాజెక్టుకు రూ.1,800 కోట్ల రుణభారం ఉంది. ఎన్‌సీసీ తన వాటాను విక్రయించటంతో రూ.990 కోట్ల మేర రుణం కూడా సెంబ్‌కార్ప్‌కు బదిలీ అవుతుంది.
 ప్రాజెక్టులో యాజమాన్య హక్కు కోల్పోయినప్పటికీ దీనికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టులను ఎన్‌సీసీనే నిర్వహిస్తుంది. ఇది 2015 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదు. దీని పక్కనే గాయత్రితో కలిసి సెంబ్‌కార్ప్ మరో విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉండటంతో ఈ ఒప్పందం సెంబ్‌కార్ప్‌కు లాభం చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement