ఎస్‌బీఐ రుణ రేట్లు తగ్గాయ్‌!

SBI lending rates declined - Sakshi

బేస్‌రేటు, బీపీఎల్‌ఆర్‌ 0.3 శాతం తగ్గింపు

80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం

కొత్త సంవత్సర కానుకగా జనవరి 1 నుంచే అమల్లోకి

ముంబై: ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బేస్‌ రేటు, బీపీఎల్‌ఆర్‌ను 0.3 శాతం మేర తగ్గించింది. దీంతో పాత వడ్డీ రేట్ల విధానంలో రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత కస్టమర్లకు బేస్‌ రేటును 8.95 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. అలాగే బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (బీపీఎల్‌ఆర్‌) 13.70% నుంచి 13.40%కి తగ్గించింది.

అయితే, మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత వడ్డీ రేటును  (ఎంసీఎల్‌ఆర్‌) మాత్రం యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 7.95%గా ఉంది. దీన్ని గానీ మరింతగా తగ్గించి ఉంటే రుణగ్రహీతలందరికీ ప్రయోజనం చేకూరేది. కొత్త రేట్లు జనవరి 1 నుంచే వర్తింపచేస్తున్నట్లు  ఎస్‌బీఐ వివరించింది. ‘డిసెంబర్‌ ఆఖరు వారంలో వడ్డీ రేట్లను సమీక్షించాం. మా డిపాజిట్‌ రేట్లను బట్టి .. బేస్‌ రేటును 30 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించి 8.65 శాతానికి కుదించాం.

బేస్‌రేటుతో వ్యత్యాసం భారీగా ఉన్న నేపథ్యంలో ఎంసీఎల్‌ఆర్‌ను గతంలోనే తగ్గించాం. ఇది మా ఖాతాదారులకు కొత్త సంవత్సరం కానుక’ అని రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ పి.కె. గుప్తా తెలిపారు. ఇటీవల తగ్గిన పాలసీ రేట్ల ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించేందుకు తాజా సమీక్ష తోడ్పడగలదని వివరించారు. గృహ, విద్యా రుణాలు తీసుకున్న పలువురు ఖాతాదారులకు ఇది ఉపయోగపడనుంది.

ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు మార్చి దాకా ..
గృహ రుణం ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు ఆఫర్‌ను ఈ ఏడాది మార్చి దాకా పొడిగిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. కొత్తగా గృహ రుణం తీసుకునే వారు, వేరే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఎస్‌బీఐకి బదలాయించుకోవాలని అనుకుంటున్న వారు ఈ ప్రయోజనాలు అందుకోవచ్చు. సుమారు 80 లక్షల మంది ఖాతాదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఎంసీఎల్‌ఆర్‌ విధానానికి మళ్లకుండా ఇంకా పాత వడ్డీ రేట్ల విధానంలోనే కొనసాగుతున్నారు. వీరికి తాజా బేస్‌ రేటు తగ్గింపు ప్రయోజనం చేకూర్చనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top