సాల్‌కాంప్‌ చేతికి నోకియా చెన్నై ప్లాంటు

Salcomp to buy Nokia's Chennai unit for Rs 215 crore - Sakshi

పదేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న ఫ్యాక్టరీ

2020 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభం

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఒకప్పటి మొబైల్స్‌ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్‌ చార్జర్ల తయారీ సంస్థ సాల్‌కాంప్‌ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన సోమవారం తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని సాల్‌కాంప్‌ పునరుద్ధరించనున్నట్లు, 2020 మార్చి నుంచి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు.

‘నోకియాకు సంబంధించిన అతి పెద్ద సెజ్‌ దాదాపు 10 ఏళ్లుగా మూతబడి ఉంది. ఈ డీల్‌తో అది మళ్లీ ప్రాణం పోసుకోనుంది. ఈ ప్లాంటులో చార్జర్లు, ఇతర పరికరాల ఉత్పత్తి జరుగుతుంది. సెజ్‌ నుంచి 70 శాతం ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి. ఎక్కువగా చైనాకు ఎగుమతి ఉంటుంది. దీని ద్వారా అయిదేళ్లలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగాను, సుమారు 50,000 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి‘ అని ఆయన తెలిపారు. మొబైల్‌ చార్జర్ల తయారీలో సాల్‌కాంప్‌ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఐఫోన్‌లకు అవసరమైన చార్జర్లను టెక్‌ దిగ్గజం యాపిల్‌కు సరఫరా చేస్తోంది.  

మేకిన్‌ ఇండియా ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌..
మరోవైపు, యాపిల్‌ తాజాగా ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మొబైల్స్‌ను భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించినట్లు రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. దేశీయంగా విక్రయించడంతో పాటు ఎగుమతుల కోసం వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత ఊతమివ్వనున్నట్లు వివరించారు. ‘ఇది భారత్‌ గర్వించతగ్గ సందర్భం. ఇప్పటిదాకా ఐఫోన్‌ బాక్స్‌లపై డిజైన్డ్‌ ఇన్‌ కాలిఫోర్నియా, అసెంబుల్డ్‌ ఇన్‌ చైనా అని ఉంటోంది.

ఇక నుంచి అసెంబుల్డ్‌ ఇన్‌ ఇండియా అనే కాకుండా భారత్‌లోనే తయారీ, మార్కెటింగ్‌ అని కూడా కనిపించనుంది‘ అని చెప్పారు. తైవాన్‌ కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సంస్థ విస్ట్రన్‌ ద్వారా యాపిల్‌ ప్రస్తుతం ఐఫోన్‌ 6ఎస్, 7లను భారత్‌లో తయారు చేస్తోంది. మేకిన్‌ ఇండియా నినాదానికి ప్రభుత్వ ఊతంతో.. 2019–20లో మొబైల్స్, విడిభాగాల ఎగుమతులు తలో 1.6 బిలియన్‌ డాలర్ల స్థాయిని దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top