అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు | Road projects for sale | Sakshi
Sakshi News home page

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

Mar 21 2019 12:28 AM | Updated on Mar 21 2019 12:28 AM

Road projects for sale - Sakshi

ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015–18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం వీటి విలువ సుమారు రూ. 37,019 కోట్లుగా ఉంటుంది. 52 ప్రాజెక్టుల్లో ఆరు డిస్కౌంటుకే అమ్ముడు కాగా.. మిగతా ప్రాజెక్టులు 2–21 శాతం ప్రీమియంకి అమ్ముడయ్యాయి. ‘చాలా మటుకు రహదారి ప్రాజెక్టులు..ప్రమోటర్లకు చాలా తక్కువ రాబడులే ఇచ్చాయి. ఆర్థికంగా బలంగా లేని డెవలపర్లు నిధుల సంక్షోభం కారణంగా నష్టానికే తమ అసెట్స్‌ను అమ్ముకున్నారు‘ అని ఇక్రా పేర్కొంది. 

మెరుగుపడిన ప్రాజెక్టుల రేటింగ్‌..
యాజమాన్యం చేతులు మారడంతో ఆయా ప్రాజెక్టులకు నిధుల లభ్యత మెరుగుపడిందని ఇక్రా వివరించింది. చాలా ప్రాజెక్టులకు మరింత తక్కువ వడ్డీ రేటుపై, మరింత దీర్ఘకాలానికి రుణాల రీఫైనాన్సింగ్‌ సదుపాయం లభించిందని పేర్కొంది. మూడో వంతు ప్రాజెక్టుల రేటింగ్స్‌ గణనీయంగా పెరిగాయి. 2014 – 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రాజెక్టుల అమలు వృద్ధి రేటు వార్షికంగా 23 శాతం మేర నమోదైందని ఇక్రా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 6,715 కి.మీ. మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. నిల్చిపోయిన ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించడం, క్లియరెన్సుల కోసం ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులోకి తేవడం, దాదాపు 80% స్థల సమీకరణ పూర్తయ్యాకే కేటాయించడం వంటి విధానపరమైన చర్యలతో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైనట్లు ఇక్రా తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 3,621 కి.మీ. ప్రాజెక్టులను కేటాయించగా.. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇది 47% వృద్ధితో 17,055 కి.మీ.కు చేరినట్లు వివరించింది. ఇందులో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 7,397 కి.మీ. ప్రాజెక్టులను గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. 

రహదారుల రంగంపై స్థిరమైన అంచనాలు..
త్వరలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల కేటాయింపులతో రహదారి డెవలపర్లు, ఈపీసీ కాంట్రాక్టర్లకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రాగలవని ఇక్రా అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం భవిష్యత్‌ స్థిరంగా ఉండగలదని పేర్కొంది. ఇక లాభదాయకత విషయానికొస్తే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండటం.. ఈపీసీ కాంట్రాక్టర్లకు సానుకూలమని వివరించింది. మొత్తం మీద చూస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో టోల్‌ వసూళ్లు కనిష్టంగానైనా రెండంకెల స్థాయిలో ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. అయితే, భారీ రుణాలపై అధిక వడ్డీ వ్యయాల కారణంగా కాంట్రాక్టర్ల నికర లాభాలపై ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement