రిలయన్స్‌ మరో సంచలనం, ప్రత్యర్థులకు గుబులే | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ మరో సంచలనం, ప్రత్యర్థులకు గుబులే

Published Tue, Dec 31 2019 2:33 PM

 Reliance announces entry into online grocery business with JioMart; to take on Amazon Flipkart - Sakshi

సాక్షి, ముంబై: ముకేశ్‌ అంబానీ  నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఏడాదిలో మరో సంచలనానికి నాంది పలికింది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు  షాకిస్తూ మరో సంస్థను ప్రారంభించింది.  రిలయన్స్‌ జియోతో  దూసుకుపోయిన  అంబానీ, తాజాగా ఈ కామర్స్ రంగంలోకి అడుగు పెట్టారు. జియో మార్ట్‌ పేరుతో ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థను తీసుకొచ్చారు.

"దేశ్ కి నయీ దుకాన్‌" అనే  ట్యాగ్‌లైన్‌ తో జియో మార్ట్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. అంతేకాదు తన కొత్త వెంచర్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా జియో వినియోగదారులకు ఆహ్వానాలు పంపింది. భారీ తగ్గింపు ధరలు, ఆఫర్లతో ఆకట్టుకున్న రిలయన్స్‌ ఇపుడు జియో మార్ట్‌ ద్వారా మరోసారి విధ్వంసానికి తెరతీసింది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి రూ.3వేల విలువైన కూపన్లను అందివ్వనుంది. వాటిని వినియోగదారులు జియో మార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ పొందవచ్చు. 

ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు ప్రాంతాల్లో నవీ ముంబై, థానే, కళ్యాణ్‌ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో వుంటాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది.  హోం డెలివరీ, రిటన్‌ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ లాంటి సేవలను కూడా అందిస్తోంది.  రిలయన్స్‌ జియో మార్ట్‌ ద్వారా 50వేలకు పైగా సరుకులను విక్రయించాలని  భావిస్తోంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న రిటైలర్లను రిలయన్స్‌ ఈ సేవలో భాగస్వామ్యం చేయనుంది.  కాగా రిలయన్స్ రిటైల్, జియో సంయుక్తంగా దేశంలో కొత్త వాణిజ్య సంస్థను ప్రారంభించనున్నట్లు  ముకేష్ అంబానీ 2019 జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement