అలా మా బంధం బీటలు వారింది: రతన్‌ టాటా

Ratan Tata Says He Fell In Love Almost Got Married - Sakshi

ముంబై: భారతదేశానికి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను తీసుకువచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా. టాటా గ్రూప్‌ చైర్మన్‌గానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటుగా తన వంతుగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కోటీశ్వరుడైనప్పటికీ నిరాడంబరంగా జీవనం సాగించే రతన్‌ టాటా యువతకు రోల్‌ మోడల్‌ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయనకు ఈ గుర్తింపు కేవలం ఒక్కరోజులోనే రాలేదు. అంతేకాదు సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన బాల్యమేమీ పూల పాన్పు కాదు. 

పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన రతన్‌ టాటాను ఆయన బామ్మ చేరదీశారు. మనవడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే... తల్లిదండ్రుల విడాకుల వ్యవహారం కారణంగా ఆయన కుంగిపోకుండా గుండె నిబ్బరంతో పెరిగేలా చేశారు. అలా తనకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి.. తనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన బామ్మ కోసం రతన్‌ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. చివరిరోజుల్లో ఆమెకు తోడుగా ఉండేందుకు ఇండియాకు రావడం వల్ల ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యారట. అందుకే బ్రహ్మచారిగా మిగిలిపోయారట. ఈ విషయాలను ప్రఖ్యాత హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రతన్‌ టాటానే చెప్పుకొచ్చారు. అమ్మానాన్నల విడాకులు, బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు, వాటిని అధిగమించిన తీరు గురించి పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘‘నా బాల్యం బాగానే ఉండేది. అయితే నా సోదరుడు, నేను కాస్త పెరిగిపెద్దవాళ్లం అవుతున్న కొద్దీ.. మా అమ్మానాన్నల విడాకుల వ్యవహారం వల్ల తోటి విద్యార్థుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పట్లో విడిపోవడం అంటే ఇప్పటిలా తేలికైన విషయం కాదు. అందుకే స్కూళ్లో మమ్మల్ని ర్యాగింగ్‌ చేసేవాళ్లు. అయితే అలాంటి సమయాల్లో మా బామ్మ  మాకు ఎంతో అండగా నిలిచింది. అలా కొన్నాళ్లు గడిచింది. కానీ ఎప్పుడైతే మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అయితే అప్పుడు కూడా బామ్మ తోడుగా నిలిచింది. సంయమనంతో ఉండటం నేర్పించింది. నేటికీ నేను అది కొనసాగిస్తున్నాను.

నాకింకా గుర్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తను నన్ను నా సోదరుడిని వేసవి సెలవుల కోసం లండన్‌కు తీసుకువెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉండాలో ముఖ్యంగా డిగ్నిటీ గురించి నేర్పించింది. ఆ విషయాలన్నీ మా మెదళ్లలో ముద్రపడిపోయాయి. తను ఎల్లప్పుడూ మా కోసమే జీవించింది. ఇప్పడు ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అంటే చెప్పలేం గానీ... మా నాన్నతో కూడా నాకు విభేదాలు వచ్చాయి. నేను వయోలిన్‌ వాయించడం నేర్చుకుంటానంటే.. నాన్న పియానో నేర్చుకోవాలని పట్టుబట్టారు.(చదవండి: రతన్‌ టాటా అద్భుత రిప్లై)

నేను అమెరికాలో చదువుతానంటే ఆయన లండన్‌లోనే చదవాలన్నారు. నేను ఆర్కిటెక్ట్‌ అవుతానంటే.. ఇంజనీర్‌ కావాలని పట్టుబట్టారు. అప్పుడు మళ్లీ బామ్మే రంగంలోకి దిగింది. తన వల్లే ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాను. అయితే ఈ విషయం నాన్నను నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాను. బామ్మ చెప్పినట్లుగా మృదువుగా మాట్లాడుతూనే.. నాకు కావాల్సిన వాటిని సాధించుకునేవాడిని. దీనంతంటికీ తనిచ్చిన ధైర్యమే కారణం.

కాలేజీ అయి పోయిన తర్వాత.. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థలో జాబ్‌ సంపాదించాను. రెండేళ్లపాటు అక్కడే పనిచేశాను. అక్కడ ఉన్నది కొంతకాలమే గానీ.. అక్కడి వాతావరణం ఎంతో అందమైనది. నా సొంత కారు, నేను ఇష్టంగా చేసే జాబ్‌. నేను ప్రేమలో పడింది కూడా అక్కడే. ఓ అమ్మాయిని ప్రేమించాను... దాదాపుగా మా పెళ్లి అయిపోయినట్లే అనే భావన. కానీ అప్పుడే నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. అప్పటికే ఏడేళ్లుగా బామ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను చూడటానికి.. తనతో ఉండటానికి ఇక్కడికి వచ్చేశాను. నాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తుందనుకున్నా.(హాలీవుడ్‌ స్టార్‌లా రతన్‌ టాటా..)

అయితే 1962లో ఇండో- చైనా యుద్ధం జరుగుతున్న సమయ అది. అప్పుడు తను ఇక్కడికి రావడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలా ఆ బంధం బీటలు వారింది’’ అని 82 ఏళ్ల రతన్‌ టాటా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా రతన్‌ టాటా తల్లిదండ్రులు నావల్‌ టాటా- సోనూ టాటా 1948లో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇరువురూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఇక నావల్‌ టాటాకు రెండో భార్య వల్ల కలిగిన సంతానం నోయల్‌ టాటా. కాగా పారిశ్రామిక రంగంలో టాటా గ్రూప్‌ను మేటిగా నిలిపిన రతన్‌ టాటాను భారత ప్రభుత్వం.. పద్మ భూషణ్‌(2000), పద్మ విభూషణ్‌(2008) పురస్కారాలతో సత్కరించిన విషయం తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top