
ఎంతో ఉన్నతమైన వ్యక్తిని ఛోటు అని పిలవడం ఆయన్ను అగౌరపరచడం అవుతుందని, ఇది సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు.
వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా (82) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టిన ఆయన అయిదు నెలల్లోనే మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించారు. దీనిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ రతన్ టాటాకు శుభాకాంక్షలు తెలిపారు. అందులో ఓ నెటిజన్ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ఛోటు అని సంబోధిస్తూ.. ‘కంగ్రాట్యులేషన్స్ ఛోటు’ అంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్ కాస్త వైరల్ అవ్వడంతో ఎంతో ఉన్నతమైన వ్యక్తిని ఛోటు అని పిలవడం ఆయన్ను అగౌరపరచడం అవుతుందని, ఇది సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు.
కాగా, తన కామెంట్‌పై సదరు మహిళ స్పందిస్తూ.. ‘ఆయన ఎంతో మందికి ఆదర్శం. ప్రేమతో నేనేమైనా చెప్పగలను’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇక తాజాగా దీనిపై రతన్ టాటా స్పందించారు. ప్రతి ఒక్కరిలో ఓ పిల్లవాడు ఉంటాడని. దయచేసి ఈ యువతిని మర్యాదగా చూసుకోండి.. అంటూ స్మైలీ సింబల్ జత చేశారు. రతన్ టాటా ఈ రిప్లైతో మరోసారి నెటిజన్ల మనసులు దోచుకున్నారు. ‘మీరు నిజంగా గొప్ప వ్యక్తి. అద్భుతమైన సమాధానం’ అంటూ ఆయన్ను ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు. (చదవండి: రతన్ టాటా కీలక మైలురాయి)