నిమో గేట్‌: మరిన్ని షాకింగ్‌ విషయాలు

Punjab National Bank fraud case: CBI probe reveals officials took commissions to sign LoUs - Sakshi

సాక్షి, ఢిల్లీ: పీఎన్‌బీ-నీరవ్‌మోదీ కుంభకోణంలో మరిన్ని కఠోరవాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందునుంచీ అనుమానిస్తున్నట్టుగానే  పంజాబ్‌ నేషనల్‌బ్యాంకు ఉద్యోగుల బండారం  బయటపడింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా  పీఎన్‌బీ ఉద్యోగులు లంచాలు, కమిషన్లకోసం సంస్థ నెత్తిన భారీ టోపీ పెట్టారు.  స్విఫ్ట్‌ సిస్టమ్‌(సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌)కు కీలకమైన లెవల్‌ 5పాస్‌వర్డ్‌లను నీరవ్‌ మోదీ, తదితరులకు అందించినట్టు నిందితులు అంగీకరించారు.  ఏజీఎం  అధికారుల స్తాయికి అనుమతి ఉన్న లెవల్‌ -5 పాస్‌వర్డ్‌ను నీరవ్‌మోదీ అనుచరులుకు  అందించినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారు  పీఎన్‌బీ కంప్యూటర్లలో లాగిన్‌ అయ్యి వెరిఫైయ్యర్‌/ఆథరైజర్‌గా తమ తమ ఎల్‌ఓయూలను క్లియర్‌ చేసుకుని, స్విఫ్ట్‌ మెసేజ్‌లను పంపేవారు. తద్వారా నీరవ్‌మోదీనుంచి  అందిన కమిషన్లను ఉద్యోగులందరూ పంచుకునేవారు. సీబీఐ దర్యాప్తులో డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌  శెట్టి, , సింగిల్‌ విండో క్లర్క్‌ మనోజ్‌ ఈ షాకింగ్‌ విషయాలను  వెల్లడించారు. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ఆరుగురు అధికారుల హస్తం ఉన్నట్టుగా కూడా నిందితులు  సీబీఐకి చెప్పారు.

అంతేకాకుండా  పీఎన్‌బీ వ్యవస్థలోని అన్ని అకౌంట్ల కంప్యూటర్‌ లాన్‌ పాస్‌వర్డులు, ఆఖరికి బ్యాంకు తాలూకు కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ కోడ్‌లు సైతం వారి అందుబాటులో ఉన్నట్లు సీబీఐ  గుర్తించింది. ముఖ్యంగా 2017లో కేవలం 63 రోజుల వ్యవధిలో ఆయన 143 ఎల్‌ఓయూలను (లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌) జారీ చేశారు.   2011 నుంచి 2017 దాకా జారీ చేసిన ఎల్‌ఓయూలు 150 కాగా.. కేవలం ఆఖరి 63 రోజుల్లో 143 ఎల్‌ఓయూలు  ఇచ్చారు.  అయితే మూడేళ్లలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన గోకుల్‌ శెట్టి ..కొనసాగడంపై ప్రశ్నించినపుడు 2013లోనే ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ వచ్చినప్పటికీ, రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వకుండా కొనసాగుతూ వచ్చాడని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఇతర అధికారుల పరిజ్ఞానం లేకుండా కేవలం ఈ ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ఈ స్థాయిలో మోసం చేసే అవకాశం లేదని  సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి.

కాగా దేశంలో అతిపెద్ద బ్యాంకు  కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, సింగిల్‌ విండో క్లర్క్‌ మనోజ్‌ కరత్‌లను  శనివారం సీబీఐ అరెస్ట్‌ చేయగా స్పెషల్‌ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్‌ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే .
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top