ఎన్నికల ర్యాలీ షురూ..!

Pre-poll stock market rally likely, say experts - Sakshi

మళ్లీ ఎన్‌డీఏదే అధికామమంటూ సర్వేల అంచనా... 

మెరుపు దాడులతో మెరుగుపడిన మోదీ గెలుపు అవకాశాలు.. 

ఎన్నికల షెడ్యూల్‌ రాగానే లాభపడ్డ స్టాక్‌ మార్కెట్‌ 

కలసివచ్చిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు; రూపాయి బలం

37,000 దాటిన సెన్సెక్స్‌; 383 పాయింట్లు అప్‌.. 

11,100 పాయింట్ల పైకి నిఫ్టీ; 133 పాయింట్ల లాభం 

ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వమే మరొక్కసారి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,150 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో స్టాక్‌ సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్‌  383 పాయింట్లు పెరిగి 37,054 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 133  పాయింట్లు పెరిగి 11,168 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది స్టాక్‌ సూచీలకు ఇవే గరిష్ట స్థాయిలు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఇది ముందస్తు ఎన్నికల ర్యాలీ అని విశ్లేషకులంటున్నారు. విద్యుత్తు, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ, లోహ, బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్‌ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.  

ఇంట్రాడేలో 435 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ జరపడం రివాజు. ఒక్క 2009 మినహా అన్ని సందర్భాల్లోనూ స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. అదే తీరు సోమవారం కూడా కొనసాగింది. 17వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదివారం వెల్లడించింది. ఆసియా మార్కెట్ల సానుకూలతల నేపథ్యలో సోమవారం సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాల జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌435 పాయింట్లు, నిఫ్టీ 146 పాయింట్లు మేర లాభపడ్డాయి. గత రెండు వారాలుగా స్మాల్, మిడ్‌ క్యాప్‌ షేర్లు పెరుగుతున్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగన్నాథమ్‌ తునుగుంట్ల వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ నాటకీయంగా తిరిగివచ్చిందని పేర్కొన్నారు.  

మరిన్ని విశేషాలు... 
►31 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు మాత్రమే అదిన్నూ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్, టీసీఎస్‌లు మినహా మిగిలిన 26 షేర్లు లాభపడ్డాయి.  
►నిఫ్టీ 50 షేర్లలో ఎనిమిది మాత్రమే నష్టపోగా, మిగిలిన 42 షేర్లు పెరిగాయి.  
► ఎయిర్‌టెల్‌ 8.08% లాభంతో రూ.338 వద్ద ము గిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.   
► గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో పతనమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ సోమవారం కూడా నష్టపోయింది. 5% నష్టంతో రూ.133 వద్దకు చేరింది. ఈ కంపెనీ వివిధ డెట్‌ సాధనాల రేటింగ్‌ను బ్రిక్‌వర్క్‌రేటింగ్స్‌ సంస్థ డౌన్‌ గ్రేడ్‌ చేయడమే దీనికి కారణం.  
►ఎలాంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ఉల్లంఘన జరగలేదంటూ వివరణ ఇవ్వడంతో గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేర్‌ 10 శాతం ఎగసి
రూ.1,033 వద్ద ముగిసింది.  
► ఈ నెల 15న జరిగే బోర్డ్‌సమావేశంలో షేర్ల బైబ్యాక్‌పై చర్చించనుండటంతో ఆర్తి డ్రగ్స్‌ షేర్‌ తాజా ఏడాది గరిష్ట స్థాయి, 705 ని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. చివరకు 0.5 శాతం నష్టంతో రూ.666 వద్ద ముగిసింది.  
►శుక్రవారమే స్టాక్‌ మార్కెట్లో లిస్టైన అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేర్‌ రెండో రోజూ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.652 వద్ద ముగిసింది.  
►యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.744ను తాకింది. చివరకు 0.25% లాభంతో రూ. 734 వద్ద ముగిసింది.   బజాజ్‌ హోల్డింగ్స్, గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్, ముత్తూట్‌ ఫైనాన్స్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి.

లాభాలు ఎందుకంటే...
►ఎన్నికల ర్యాలీ: ఇటీవల బాల్‌కోటలో జరిగిన మెరుపుదాడి కారణంగా ఎన్‌డీఏ విజయావకాశాలు మరింతగా మెరుగుపడ్డాయనే అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే పెద్ద, మధ్య, చిన్న అన్ని స్థాయి కంపెనీల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయని నిపుణులంటున్నారు.  
► విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు:  భారత్‌–పాక్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం, వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు లిక్విడిటీ అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి 5 ట్రేడింగ్‌  సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,741 కోట్లు పెట్టుబడులు పెట్టారు. సోమవారం ఒక్కరోజే రూ.3,810 కోట్లు ఇన్వెస్ట్‌చేశారు.
►పుంజుకున్న రూపాయి: డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 25 పైసలు పుంజుకొని 69.89ను తాకింది. గత వారం రూపాయి 78 పైసలు పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా వస్తుండటంతో రూపాయి బలపడుతోంది.  
►   ప్రపంచ మార్కెట్ల జోరు: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి చైనా ప్రభుత్వం విధానాల తోడ్పాటునందించగలదన్న ఆశలతో చైనా మార్కెట్‌ లాభపడింది. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఈ ప్రభావంతో యూరప్‌ మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. ఇదంతా మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. షాంఘై సూచీ 2 శాతం, జపాన్‌ నికాయ్‌ 0.4 శాతం, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1 శాతం చొప్పున పెరిగాయి.  
►  లక్ష్యానికనుగుణంగానే ద్రవ్యలోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.4 శాతం ద్రవ్యలోటు సాధించాలన్న లక్ష్యం నెరవేరుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. పరోక్ష పన్ను వసూళ్లు తగ్గినా, ద్రవ్యలోటు లక్ష్యం సాధిస్తామని ప్రభుత్వ వర్గాలు ధీమాగా ఉన్నాయి.  
►బాండ్లలో ఎఫ్‌పీఐల పరిమితి పెంపు: కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితిని ఆర్‌బీఐ పెంచడం సానుకూల ప్రభావం చూపించింది.

రూ.2.27 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
స్టాక్‌ మార్కెట్‌ భారీ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద బాగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ గత శుక్రవారం రూ.1,44,67,088 కోట్లుగా ఉంది. ఈ మార్కెట్‌ క్యాప్‌ సోమవారం రూ.2.27 లక్షల కోట్లు పెరిగి రూ.1,46,94,699 కోట్లకు ఎగసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top