దేశ ఆర్థిక మూలాలు పటిష్టం

 PM Narendra Modi meets top economists ahead of Union Budget - Sakshi

ఎకానమీకి పుంజుకునే సత్తా ఉంది

5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోగలం...

సమష్టి కృషితో ఇది సాధ్యమే

నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

ఆర్థికవేత్తలు, నిపుణులు వ్యాపార దిగ్గజాలతో భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు సమష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. గురువారం నీతి ఆయోగ్‌లో పలువురు ఆర్థికవేత్తలు, ప్రైవేట్‌ ఈక్విటీ .. వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు, వ్యాపార దిగ్గజాలు, వ్యవసాయ రంగ నిపుణులు మొదలైన వారితో బడ్జెట్‌ ముందస్తు సమవేశంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో వివిధ రంగాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలియజేశారు.

విధానకర్తలు, వివిధ వర్గాలు సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ఇవి తోడ్పడగలవని మోదీ చెప్పారు. 5 ట్రిలియన్‌ (లక్ష కోట్లు) డాలర్ల ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదని.. దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీన్ని నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు. ‘దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు అవసరమైన సత్తా..  టూరిజం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో పుష్కలంగా ఉన్నాయి’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికల్లో జరిగే మేధోమథనాలు దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి నింపగలవని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు తీసుకోదగిన చర్యల గురించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటున్న మోదీ.. సోమవారం పలువురు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన సంగతి తెలిసిందే.  

రుణ వితరణ పెరగాలి...
రుణ వితరణ పెంచాలని .. ఎగుమతుల వృద్ధికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గవర్నెన్స్‌ మెరుగుపడటానికి, వినియోగానికి డిమాండ్‌ పెంచేందుకు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వల్పకాలికంగా తీసుకోదగ్గ చర్యలపై సత్వరం నిర్ణయం తీసుకుంటామని, దీర్ఘకాలిక అంశాలకు సంబంధించి వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమైనందున కాలక్రమేణా అమలు చేయగలమని మోదీ హామీ ఇచ్చారు. ‘ఆర్థిక వృద్ధి, స్టార్టప్స్, నవకల్పనలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది‘ అని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌.. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆర్థిక మంత్రి గైర్హాజరు...
దాదాపు 40 మంది పైగా నిపుణులు, ఆర్థిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే, బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్గాలతో ప్రి–బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటున్నందున.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనికి హాజరు కాలేదు. ఫిబ్రవరి 1న ఆమె రెండోసారి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top