ఫార్మా స్టాక్స్‌లో మరింత అప్‌సైడ్‌

Pharma stocks may gain: experts opinion - Sakshi

లుపిన్‌, అజంతా ఫార్మా ర్యాలీకి రెడీ

వచ్చే వారం నిఫ్టీకి 10,950 వద్ద రెసిస్టెన్స్‌

10,570 వద్ద సపోర్ట్‌ లభించవచ్చు 

శామ్‌కో గ్రూప్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి శుక్రవారం(17)తో ముగిసిన వారంలో 10,800-10,900 స్థాయిలో పలుమార్లు అవరోధాలు ఎదురయ్యాయని శామ్‌కో గ్రూప్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో వచ్చే వారం 10,950 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. 10,550 స్థాయిలో సపోర్ట్‌ లభించే వీలున్నదని చెప్పారు. ఈ స్థాయికంటే దిగువకు చేరితే 9,900 పాయింట్లను నిఫ్టీ తిరిగి పరీక్షించవచ్చని అంచనా వేశారు. ఫార్మా రంగంలో రెండు కౌంటర్లకు బయ్‌ రేటింగ్‌ను ఇవ్వగా.. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను విక్రయించవచ్చునంటూ సూచించారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు చూద్దాం.. 

అటూఇటుగా
కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్లపై ఆశలు, ఆర్‌ఐఎల్‌ ఏజీఎం, ఇన్ఫోసిస్‌, విప్రో తదితర ఐటీ దిగ్గజాల ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. కోవిడ్‌ సవాళ్లలోనూ ఐటీ దిగ్గజాలు ఉత్తమ పనితీరు ప్రదర్శించాయి. ట్రావెల్‌, ఎస్‌జీఏ వ్యయాలు తగ్గడం, ఫారెక్స్‌ లాభాలు వంటి అంశాలు మార్జిన్లకు బలమిచ్చాయి. అయితే ఇటీవల ఐటీ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా ఈ రంగంలో పెట్టుబడులకు 10-12 శాతం కరెక్షన్‌ కోసం వేచిచూడటం మేలు. ఇక ఫార్మా స్టాక్స్‌లో స్వల్పకాలిక చలన సగటు ప్రాతిపదికన పుల్‌బ్యాక్‌ వచ్చింది. అయినప్పటికీ ఈ రంగంలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. ఫార్మా రంగంలో కొన్ని కౌంటర్లు తదుపరి దశ ర్యాలీకి సిద్ధంగా ఉన్న సంకేతాలు లభిస్తున్నాయి. 

 లుపిన్ లిమిటెడ్‌
ఫార్మా దిగ్గజం లుపిన్‌ షేరుకి రూ. 850 స్థాయిలో సపోర్ట్‌ లభిస్తోంది. దీంతో రూ. 980 టార్గెట్‌ ధరతో రూ. 890 స్థాయిలో కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నాం. అయితే రూ. 850 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో లుపిన్‌ రూ. 897 వద్ద ముగిసింది.

అజంతా ఫార్మా
వారపు చార్టుల ప్రకారం హెల్త్‌కేర్‌ కంపెనీ అజంతా ఫార్మాకు రూ. 1330 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. ఇటీవల ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇది మరింత బలపడే వీలుంది. రూ. 1600 టార్గెట్‌ ధరతో రూ. 1440 స్థాయిలో అజంతా ఫార్మా షేరుని కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1370 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో అజంతా ఫార్మా రూ. 1459 వద్ద ముగిసింది.

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
డౌన్‌ట్రెండ్‌లో ఉన్న పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ తాజాగా ర్యాలీ బాట పట్టింది. తద్వారా ఓవర్‌బాట్‌ పొజిషన్‌కు చేరింది. దీంతో రూ. 1420-1460 స్థాయిలవద్ద రెసిస్టెన్స్‌ కనిపిస్తోంది. వెరసి రూ. 1050 టార్గెట్‌ ధరతో రూ. 1360-1368 స్థాయిలలో ఈ షేరుని విక్రయించవచ్చని భావిస్తున్నాం. రూ. 1485 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.  శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 1381 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top