భారత మార్కెట్లోకి పేపాల్‌ ఎంట్రీ | Sakshi
Sakshi News home page

భారత మార్కెట్లోకి పేపాల్‌ ఎంట్రీ

Published Thu, Nov 9 2017 12:23 AM

PayPal Entry into Indian Market - Sakshi

ముంబై: అంతర్జాతీయ డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేపాల్‌ హోల్డింగ్స్‌ తాజాగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. భారత వినియోగదారులు ఇక దేశీయంగా కూడా పలు ప్రముఖ పోర్టల్స్‌లో తమ చెల్లింపుల సర్వీసుల ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయొచ్చని పేపాల్‌ పేర్కొంది.  దాదాపు దశాబ్ద కాలంగా భారత్‌లో చిన్న, మధ్యతరహా సంస్థలు, ఫ్రీలాన్సర్స్‌కి సీమాంతర చెల్లింపుల సేవలు అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల విస్తరణకు.. డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలు కాకుండా నాణ్యమైన సేవలు అందించడంపైనే దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశీయంగా జరిగే బిజినెస్‌ టు కస్టమర్‌ (బీ2సీ) ఎగుమతి లావాదేవీల్లో మూడో వంతు వాటా తమదే ఉంటోందని పేపాల్‌ తెలిపింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) లైసెన్స్‌ తీసుకునే అవకాశాలను కూడా పేపాల్‌ ప్రస్తుతం పరిశీలిస్తోంది.  

డిజిటల్‌ చెల్లింపులకు భారత్‌ ఊతమిస్తున్న నేపథ్యంలో ఈ–టూరిస్ట్‌ వీసా, డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించి పలు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులతో కూడా చేతులు కలిపినట్లు సంస్థ కంట్రీ మేనేజర్‌ అనుపమ్‌ పహుజా తెలిపారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు మరింతగా పెరగనున్న నేపథ్యంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల కస్టమర్లు తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి రాగలరని ఆసియాపసిఫిక్‌ ప్రాంత కార్యకలాపాల జీఎం రోహన్‌ మహదేవన్‌ తెలిపారు. పేపాల్‌ సర్వీసులు అందుబాటులో ఉండే పలు వ్యాపార సంస్థల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. అయితే, వీటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ దిగ్గజాలు లేకపోవడం గమనార్హం. వీటితో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు పేపాల్‌ పేర్కొంది.   

Advertisement
Advertisement