జెట్‌ బాటలో మరో సంస్థ..

Pawan Hans Delays Employees Salaries For April - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మూసివేతకు దారితీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ బాటలో మరో విమానయాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఏప్రిల్‌ వేతనాలు చెల్లించలేమని పవన్‌ హంస్‌ యాజమాన్యం ఉద్యోగులకు పంపిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కంపెనీ సామర్ధ్యాన్ని పూర్తిగా సమీక్షించిన మీదట సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడైందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గి నికర నష్టం రూ 89 కోట్లుగా నమోదైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

పౌరవిమానయాన రంగంలో పరిస్థితులు సైతం భవిష్యత్‌ వృద్ధికి ఏ మాత్రం సానుకూలంగా లేవని స్పష్టం చేసింది. కాగా, కంపెనీ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వేతనాలు చెల్లించలేమని యాజమాన్యం పేర్కొనడం పట్ల పవన్‌ హంస్‌ ఉద్యోగుల సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ చర్య అమానవీయమైనదని ఆక్షేపించింది. వేతన సవరణ కోసం వేచిచూస్తున్న ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం తగదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పెరిగిన వేతనాలను అందుకుంటున్న క్రమంలో యాజమాన్యం చర్య తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. యాజమాన్యం చర్యకు నిరసనగా తాము నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతామని పేర్కొంది. మరోవైపు ఉద్యోగులకు ఏప్రిల్‌ వేతనాలను నిలిపివేయలేదని, ఏప్రిల్‌ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య పరిమితమని పవన్‌హంస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top