ఎన్‌టీపీసీకి లాభాల వెలుగు

NTPC net profit up 40% in Q4 - Sakshi

41 శాతం వృద్ధితో రూ.2,926 కోట్లకు నికర లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ, ఎన్‌టీపీసీ 2017–18 నాలుగో త్రైమాసిక కాలంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.2,926 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2016–17 క్యూ4లో సాధించిన నికర లాభం రూ.2,079 కోట్లతో పోలిస్తే 41 శాతం వృద్ధి సాధించినట్లు లెక్క.

ఆదాయం అధికంగా ఉండటం తో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ వివరించింది. మొత్తం ఆదాయం రూ.20,887 కోట్ల నుంచి రూ.23,618 కోట్లకు ఎగసింది. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 81.21 శాతం నుంచి 79.03 శాతానికి తగ్గిందని, స్థూల విద్యుదుత్పత్తి 63.77 బిలియన్‌ యూనిట్ల నుంచి 68.58 బిలియన్‌ యూనిట్లకు పెరిగిందని కంపెనీ వివరించింది.

మొత్తం డివిడెండ్‌ రూ.5.12
రూ.10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.39 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఎన్‌టీపీసీ తెలిపింది. రూ.2.79 మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలిపితే 2017–18లో డివిడెండ్‌ ఒక్కో షేర్‌కు రూ.5.12 అవుతుందని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.10,714 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,502 కోట్లకు తగ్గింది.

మొత్తం ఆదాయం రూ.83,009 కోట్ల నుంచి రూ.89,642 కోట్లకు పెరిగింది. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 78.59 శాతం నుంచి 77.90 శాతానికి తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 250 బిలియన్‌ యూనిట్ల నుంచి 266 బిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ షేరు 1.3 శాతం లాభంతో రూ.167 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top