రక్తంతో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ | Now charge your phone with blood flow | Sakshi
Sakshi News home page

రక్తంతో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌

Sep 25 2017 5:43 PM | Updated on Sep 26 2017 12:00 AM

Now charge your phone with blood flow

బీజింగ్‌ : మానవుల శరీరంలోని రక్తనాళాల్లో ప్రవహించే రక్త పీడనంతోనే విద్యుత్‌ ఉత్పత్తి అయితే వైద్యవిజ్ఞాన పరంగా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అదే విద్యుత్‌తో మన సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోగలిగితే మొబైల్‌ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకరావచ్చు. సరిగ్గా ఈ దిశగానే చైనాలో ఫుడాన్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. మానవుల శరీరంలోని రక్త ప్రవాహంతో సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవచ్చని నిరూపించారు.

రక్త ప్రవాహం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతి తేలికపాటి విద్యుత్‌ జనరేటర్‌ను ఫైబర్‌తో తయారు చేసిన నానో కార్బన్‌ గొట్టాల ద్వారా రూపొందించారు. దీన్ని ‘ఫైబర్‌ షేప్డ్‌ ఫ్లూడిక్‌ నానో జనరేటర్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎన్‌జీ)’గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలక్ట్రోడ్స్‌తో అనుసంధానించి ఓ ద్రావకంలోకి పంపించి ద్రావకాన్ని రక్తనాళాల్లోకి పంపించారు. ఎఫ్‌ఎఫ్‌ఎన్‌జీ, ద్రావకం మధ్య ఉత్పన్నమైన తరంగాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇంతవరకు జరిపిన ఇలాంటి ప్రయోగాలకన్నా ఈ ప్రయోగం ద్వారా ఎక్కువ విద్యుత్, అంటే  20 శాతం విద్యుత్‌ ఉత్పత్తి అయిందని పరిశోధకులు తెలిపారు.

వాస్తవానికి సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవడం కన్నా గుండెకు అమర్చే పేస్‌మేకర్‌ లాంటి వైద్య పరికరాలకు అవసరమైన విద్యుత్‌ను ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడం ఉత్తమమైన మార్గమని పరిశోధకులు తెలిపారు. నీటి ప్రవాహాన్ని ఉపయోగించి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఎలాగైతే ఉత్పత్తి చేస్తామో అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్త ప్రవాహం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిని చేయగలిగామని చెప్పారు. మానవ రక్తంలోకి నానో విద్యుత్‌ జనరేటర్‌ లేదా దానికి సంబంధించిన ద్రావకాన్ని పంపించినట్లయితే రక్త ప్రవాహానికి ఎక్కడైనా అవాంతరం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పైగా తాము ఈ ప్రయోగాన్ని కప్పల రక్తనాళాలపై జరిపి విజయం సాధించామని, ఇంకా మానవ రక్త నాళాలపై పరిశోధనలు జరపాల్సి ఉందని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement