breaking news
Mobile charges
-
షాకింగ్ : భారీగా పెరగనున్న మొబైల్ చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : చౌక మొబైల్ చార్జీలకు కాలం చెల్లింది. ఈనెల 3 నుంచి కాల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. ప్రీపెయిడ్ సేవలు, ప్రోడక్టులపై నూతన టారిఫ్‌లు, ప్లాన్లను ప్రకటించామని, డిసెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెలికాం టారిఫ్‌ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపను ప్రకటించింది. మరోవైపు దేశంలో డిజిటల్ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్‌లను పెంచుతామని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఎయిర్టెల్ సైతం టారిఫ్‌ల పెంపునకు రంగం సిద్ధం చేసింది. -
రక్తంతో సెల్‌ఫోన్ చార్జింగ్
బీజింగ్ : మానవుల శరీరంలోని రక్తనాళాల్లో ప్రవహించే రక్త పీడనంతోనే విద్యుత్ ఉత్పత్తి అయితే వైద్యవిజ్ఞాన పరంగా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అదే విద్యుత్‌తో మన సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోగలిగితే మొబైల్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకరావచ్చు. సరిగ్గా ఈ దిశగానే చైనాలో ఫుడాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. మానవుల శరీరంలోని రక్త ప్రవాహంతో సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవచ్చని నిరూపించారు. రక్త ప్రవాహం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతి తేలికపాటి విద్యుత్ జనరేటర్‌ను ఫైబర్‌తో తయారు చేసిన నానో కార్బన్ గొట్టాల ద్వారా రూపొందించారు. దీన్ని ‘ఫైబర్ షేప్డ్ ఫ్లూడిక్ నానో జనరేటర్ (ఎఫ్ఎఫ్ఎన్జీ)’గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలక్ట్రోడ్స్‌తో అనుసంధానించి ఓ ద్రావకంలోకి పంపించి ద్రావకాన్ని రక్తనాళాల్లోకి పంపించారు. ఎఫ్ఎఫ్ఎన్జీ, ద్రావకం మధ్య ఉత్పన్నమైన తరంగాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇంతవరకు జరిపిన ఇలాంటి ప్రయోగాలకన్నా ఈ ప్రయోగం ద్వారా ఎక్కువ విద్యుత్, అంటే 20 శాతం విద్యుత్ ఉత్పత్తి అయిందని పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవడం కన్నా గుండెకు అమర్చే పేస్‌మేకర్ లాంటి వైద్య పరికరాలకు అవసరమైన విద్యుత్‌ను ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడం ఉత్తమమైన మార్గమని పరిశోధకులు తెలిపారు. నీటి ప్రవాహాన్ని ఉపయోగించి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఎలాగైతే ఉత్పత్తి చేస్తామో అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్త ప్రవాహం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిని చేయగలిగామని చెప్పారు. మానవ రక్తంలోకి నానో విద్యుత్ జనరేటర్ లేదా దానికి సంబంధించిన ద్రావకాన్ని పంపించినట్లయితే రక్త ప్రవాహానికి ఎక్కడైనా అవాంతరం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పైగా తాము ఈ ప్రయోగాన్ని కప్పల రక్తనాళాలపై జరిపి విజయం సాధించామని, ఇంకా మానవ రక్త నాళాలపై పరిశోధనలు జరపాల్సి ఉందని వారు చెప్పారు. -
మొబైల్ చార్జీలు దిగొచ్చే చాన్స్
పూర్తి స్థాయి స్పెక్ట్రం షేరింగ్‌కు ట్రాయ్ సిఫార్సులు తగ్గనున్న టెల్కోల వ్యయాలు న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు అన్ని రకాల స్పెక్ట్రంను పరస్పరం పంచుకునేందుకు (స్పెక్ట్రం షేరింగ్) అనుమతించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. దీంతో ఒకవైపు వ్యయాల తగ్గుదల రూపంలో టెల్కోలకు, కాల్ చార్జీల తగ్గుదల రూపంలో మొబైల్ వినియోగదారులకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. స్పెక్ట్రం షేరింగ్ విధివిధానాలకు సంబంధించి ట్రాయ్ సోమవారం చేసిన సిఫార్సుల ప్రకారం 2జీ, 3జీ, 4జీ సర్వీసులు అందించేందుకు వివిధ స్పెక్ట్రం బ్యాండ్లను టెలికం కంపెనీలు పరస్పరం పంచుకోవచ్చు. అయితే, తమ దగ్గర ఉన్న ఒకే రకమైన బ్యాండ్ స్పెక్ట్రంను మాత్రమే పంచుకోవడానికి వీలు ఉంటుంది. అంటే..3జీ స్పెక్ట్రం ఉన్న సంస్థలు 3జీ స్పెక్ట్రంను మాత్రమే ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుంటుంది. అంతే తప్ప 4జీ స్పెక్ట్రంను పంచుకోవడానికి కుదరదు. అలాగే, ఈ తరహా ఒప్పందాలు రెండు సంస్థలకు మాత్రమే పరిమితమవుతాయి. గతంలో వేలం లేకుండా అసైన్ చేసిన స్పెక్ట్రం, పాత రేటు రూ. 1,658 కోట్లకు కేటాయించిన స్పెక్ట్రంనకు కూడా ఇది వర్తిస్తుంది. ట్రాయ్ సిఫార్సులపై టెలికం విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, టాటా టెలీ తదితర కంపెనీలకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. స్పెక్ట్రం వ్యయాలు గణనీయంగా తగ్గితే.. టెల్కోలు ఆ ప్రయోజనాలను టారిఫ్‌ల తగ్గింపు రూపంలో యూజర్లకు బదలాయించే అవకాశం ఉంది. స్పెక్ట్రం వ్యయాలను తగ్గే దిశగా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక సర్వే ఇటీవలే సూచించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం 800 మెగాహెట్జ్ (సీడీఎంఏ సర్వీసులకు), 900..1800..2100 మెగాహెట్జ్ (2జీ,3జీ సేవలకు), 2300..2500 మెగాహెట్జ్ (4జీ సర్వీసులకు) బ్యాండ్లలో స్పెక్ట్రంను ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఇస్తోంది. పాత లెసైన్సింగ్ విధానంలో ధరతో పోలిస్తే ఇటీవలి స్పెక్ట్రం వేలం ధరలు ఏకంగా అయిదు రెట్లు అధికంగా ఉన్నాయి. టెలికం ఆపరేటర్ల మధ్య ప్రస్తుతం కొంత మేర సర్దుబాటు ఒప్పందాలు ఉంటున్నాయి. స్పెక్ట్రం కాకుండా.. మొబైల్ టవర్లు వంటి మౌలిక సదుపాయాలను పంచుకుంటున్నాయి. అయితే, నూతన లెసైన్సింగ్ విధానం కింద పొందిన స్పెక్ట్రంను పంచుకునేందుకు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అలాగే, వేలం లేకుండా కేటాయించిన స్పెక్ట్రంను కూడా వన్‌టైమ్ చార్జీ కట్టి కంపెనీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. అయితే, వన్‌టైమ్ ఫీజుపై టెలికం కంపెనీలు కోర్టుకెళ్లడంతో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఎంఎన్‌పీ లెసైన్సు ఫీజు యథాతథం.. దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ)ని అందుబాటులోకి రానున్నప్పటికీ.. ఈ సర్వీసుల ందించే సంస్థల లెసైన్సు ఫీజులు, బ్యాంకు గ్యారంటీలను పెంచాల్సిన అవసరం లేదని ట్రాయ్ పేర్కొంది. వీటిని యథాతథంగానే ఉంచవచ్చని టెలికం విభాగానికి తెలిపింది. ఎంఎన్‌పీ వాడకం ఒక మోస్తరుగానే ఉంటున్నందున ఈ సంస్థల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వివరించింది. దేశవ్యాప్త సర్వీసులకు ఇవి అదనపు మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో వాటిపై భారం భారీగా పెరుగుతుందని ట్రాయ్ వివరించింది. ఎంఎన్‌పీ వల్ల ఆపరేటరును మార్చినా పాత మొబైల్ నంబరునే కొనసాగించే వీలుంటుంది.