
పెట్టుబడులకు ప్రపంచంలోనే భారత్ అనువైన ప్రాంతమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్వెస్టర్లను స్వాగతించారు.
వాషింగ్టన్ : పెట్టుబడులకు భారత్ కంటే ప్రపంచంలో మరో అనువైన ప్రాంతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సంస్కరణలను చురుకుగా ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని, ఇక్కడ నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, పెట్టుబడిదారులకు అనువైన సంస్కరణలు చేపట్టడంలో ముందున్నామని తెలిపారు. భారత్‌లో న్యాయవ్యవస్థ ప్రక్రియ కొంత జాప్యం నెలకొంటున్నా వేగవంతమైన సంస్కరణలు, పటిష్ట చట్టాలు, పారదర్శకత పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సహకారంతో ఫిక్కీ ఈ సదస్సును నిర్వహించింది. భారత్‌లో ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని అడగ్గా ఒత్తిడికి గురువుతున్న రంగాలను చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.తదుపరి బడ్జెట్ కోసం వేచిచూడకుండా ఆయా రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో వినిమయ రంగం పుంజుకునేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గ్రామాలు, జిల్లాలను సందర్శించి విరివిగా అర్హులకు రుణాలు ఇవ్వాలని తాను ఇప్పటికే కోరానని చెప్పారు.