దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు | Nifty must keep its head above 10825 for upmove | Sakshi
Sakshi News home page

దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

Feb 26 2019 12:44 AM | Updated on Feb 26 2019 12:44 AM

Nifty must keep its head above 10825 for upmove - Sakshi

దేశీ, విదేశీ సంస్థల భారీ నిధుల వరదకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు కీలక నిరోధ స్థాయిలను అధిగమించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి.  చైనా ఉత్పత్తులపై విధించాలనుకుంటున్న సుంకాల గడువును మార్చి 1 నుంచి పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం మన మార్కెట్‌పై సానకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 342 పాయింట్లు పెరిగి 36,213 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 10,880 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చినట్లయింది.  

కలసివచ్చిన షార్ట్‌కవరింగ్‌.... 
గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.631 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.839 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో భారీగా నిధులు గుమ్మరించడంతో సోమవారం జోరుగా కొనుగోళ్లు జరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 17 పైసలు బలపడడం, ఫిబ్రవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కూడా కలసివచ్చాయి. నిర్మాణంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లపై పన్ను రేటును జీఎస్‌టీ మండలి తగ్గించడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ జోష్‌ను పెంచింది. లాభాల్లో ఆరంభమైన సూచీలు రోజంతా అదే జోరును చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌371 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. 

మార్కెట్‌ కబుర్లు
►రియల్టీ రంగానికి అనుకూలంగా జీఎస్‌టీ మండలి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, రియల్టీ షేర్లు నష్టపోయాయి. ఈ నిర్ణయాల వల్ల వినియోగదారులకే కా నీ, కంపెనీలకు పెద్దగా  ఒరిగేదేమీ ఉండబోదనే అంచనాలు వెలువడ్డాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో    లాభపడ్డ  రియల్టీ షేర్లు చివరకు నష్టపోయాయి
►బోనస్‌ ఇష్యూకు వాటాదారుల ఆమోదం లభించడం, బోనస్‌కు రికార్డ్‌ డేట్‌గా వచ్చే నెల 7ను నిర్ణయించడం వంటి అంశాల నేపథ్యంలో విప్రో షేర్‌ ఇంట్రాడేలో 4.5 శాతం లాభంతో రూ.396ను తాకింది. ఇది 19 ఏళ్ల గరిష్ట స్థాయి. చివరకు ఈ షేర్‌ 1.8 శాతం లాభంతో రూ.386 వద్ద ముగిసింది.  
​​​​​​​►ముంబై ఎయిర్‌పోర్ట్‌ కంపెనీలో జీవీకే కంపెనీ మరింత వాటాను పెంచుకోవడంతో జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ షేర్‌ ఇంట్రాడేలో 16% లాభంతో రూ.8.59ను తాకింది. చివరకు 9% లాభంతో రూ.8 వద్ద ముగిసింది. గత శుక్రవారం ఈ షేర్‌ 20% అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన విషయం తెలిసిందే.  
​​​​​​​►యస్‌ బ్యాంక్‌ షేర్‌ 3.2% లాభపడి రూ.229 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
​​​​​​​► ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ 2.4 శాతం వరకూ నష్టపోయాయి.  
​​​​​​​►  రూ.5,600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ స్కామ్‌లో మోతిలాల్‌ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్‌ల కమోడిటీ విభాగాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించాయంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్త, సెబీ వెల్లడించడంతో సదరు సంస్థలు ఇంట్రాడేలో 5–9 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. చివరకు మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.5 శాతం నష్టంతో రూ.603 వద్ద, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ 0.2 శాతం నష్టంతో రూ.364 వద్ద ముగిశాయి.  
​​​​​​​►జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటీషన్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ యోచిస్తోందని వార్తలు రావడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 3.1 శాతం నష్టపోయి రూ.229 వద్ద ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement