
చివర్లో కొనుగోళ్లతో లాభాలు
హెచ్చు తగ్గులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది.
♦ తొలుత లాభాల స్వీకరణతో క్షీణత
♦ యూరప్ రికవరీతో లాభాల్లోకి
♦ 130 పాయింట్లు ఎగసి 25,400కు సెన్సెక్స్
♦ 46 పాయింట్ల లాభంతో 7,759కు నిఫ్టీ
న్యూఢిల్లీ: హెచ్చు తగ్గులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. నష్టాల్లో ప్రారంభమైన యూరప్ మార్కెట్లు రికవరీ కావడం, మంగళవారం ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 25,400 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 7,759 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, వాహన, టెలికం షేర్లు లాభపడ్డాయి.
ఊపునిచ్చిన సర్వే...
భారత తయారీ రంగం మార్చిలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరిందన్న నికాయ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వే సెంటిమెంట్‌కు మరింత ఊపునిచ్చింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం, ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉండడంతో వృద్ధి జోరు పెంచడానికి ఆర్‌బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను అర శాతం వరకూ తగ్గించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.ఆర్‌బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని, అంతకు మించిన తగ్గింపు ఉంటే మార్కెట్ దూసుకుపోతుందని నిపుణులంటున్నారు.
జియోమెట్రిక్ జోరు
ఈక్విటీ స్వాప్ డీల్ ద్వారా జియోమెట్రిక్ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించడంతో జియో మెట్రిక్ షేర్ 19 శాతం లాభంతో రూ.234 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 20 శాతం లాభపడి ఏడాది గరిష్ట స్థాయి(రూ.235.2)ను తాకింది. ఈక్విటీ స్వాప్ డీల్‌లో భాగంగా రూ.2 ముఖ విలువ ఉన్న 43 ఈక్విటీ షేర్లకు రూ.2 ముఖ విలువ గల 10 హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జారీ చేస్తుంది. డీల్ విలువ రూ.1,283 కోట్లు. నష్టాల్లో ‘పనామా’ షేర్లు...
పనామా పేపర్ల జాబితాలో పేర్లున్న ప్రమోటర్లుకు చెందిన డీఎల్‌ఎఫ్, ఇండియాబుల్స్ గ్రూప్ కంపెనీల షేర్లు(ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ రియల్‌ఎస్టేట్, ఇండియాబుల్స్ హోల్‌సేల్ సర్వీసెస్), ఆపోలోటైర్స్ కంపెనీల షేర్లు 3-4 శాతం రేంజ్‌లో పడిపోయాయి. హెక్సావేర్ టెక్నాలజీస్‌లో 20 శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బారింగ్ ఏషియా విక్రయించనున్నదన్న వార్తలతో హెక్సావేర్ టెక్నాలజీస్ షేర్ 7 శాతం క్షీణించి రూ.254 వద్ద ముగిసింది.