నాన్‌వెజ్‌ పచ్చళ్లకు ఆన్‌లైన్‌ దారి

నాన్‌వెజ్‌ పచ్చళ్లకు ఆన్‌లైన్‌ దారి


రాజు పికిల్స్‌.కామ్‌

పాఠకుల నుంచి స్టార్టప్‌ డైరీ కాలమ్‌కు విశేష స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్టార్టప్స్‌ సంస్థలు తమ సేవల గురించి పాఠకులకు అందించేందుకు స్టార్టప్స@సాక్షి.కామ్‌కు మెయిల్స్‌ పంపిస్తున్నాయి. అయితే స్థలాభావం కారణంగా వాటిల్లో నుంచి ఉపయుక్తమైన కొన్నింటిని ఎంపిక చేసి విడతల వారీగా ప్రచురిస్తున్నాం. ఈవారం ‘స్టార్టప్‌ డైరీ’లో రాజు పికిల్స్‌.కామ్, జీరోకాస్ట్‌ హైరింగ్‌.కామ్‌ గురించి!

–హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో



చదివింది ఇంటరే. పైగా గృహిణి. తెలిసిందల్లా నోరూరే వంటలు చేయడం. అందులోనూ మాంసాహార పచ్చళ్లలో అందె వేసిన చేయి. అదే వ్యాపార అవకాశంగా మలుచుకుందామె. రాజు పికిల్స్‌.కామ్‌ పేరిట ఆన్‌లైన్‌లో పచ్చళ్లను విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ దాట్ల సౌజన్య మాటల్లోనే..



మాది తూర్పు గోదావరిలోని భీమవరం. మావారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాం. భీమవరం పచ్చళ్లకు బాగా ఫేమస్‌ కావటంతో ఎప్పుడు నేను ఊరెళ్లినా సరే ఇక్కడి చుట్టుపక్కల వాళ్లు వచ్చేటప్పుడు పచ్చళ్లు తీసుకురమ్మని చెప్పేవాళ్లు. చాలాసార్లు తీసుకొచ్చా కూడా. ఒకసారి అనుకోకుండా ఊరి నుంచి తీసుకొచ్చే బదులు మనమే తయారు చేసి విక్రయిస్తే పోలే అనిపించింది. ఇంకేముంది మా వారి సహకారంతో 2015 మార్చిలో రాజు పికిల్స్‌.కామ్‌ను ప్రారంభించా.



రాజు పికిల్స్‌లో కేవలం చికెన్, మటన్, రొయ్యలు, నాటుకోడి పచ్చళ్లుంటాయి. వెజిటేబుల్‌ పచ్చళ్లు తయారు చేయాలంటే అన్ని కాలాల్లో సెట్‌కాదు. పైగా మార్జిన్స్‌ కూడా తక్కువ. మియాపూర్‌లోని మా ఇంట్లో తయారు చేస్తాం. పచ్చళ్లలో వాడే కారం, మసాలాలు, దినుసుల వంటివన్నీ భీమవరం నుంచి దిగుమతి చేసుకుంటాం.



ధరలు కిలోకు చికెన్‌ రూ.875, నాటుకోడి రూ.1,600, మటన్, రొయ్యలు రూ.1,200గా నిర్ణయించాం. 45–60 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం నెలకు 140 కిలోల పచ్చళ్లను డెలివరీ చేస్తున్నాం. సుమారు 80–100 మంది కస్టమర్లు ఆర్డర్లిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల నుంచే కాకుండా యూఎస్, యూకే, కెనడా దేశాల నుంచి కూడా ఆర్డర్లొస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా మా కస్టమర్లుగా ఉన్నారు.



ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నాం. సరుకుల డెలివరీ కోసం ఫెడెక్స్, డెల్హివరీ కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఫేస్‌బుక్, పలు మీడియా సంస్థల ప్రచారంతో ఇతర దేశాల్లోని కస్టమర్లనూ అకర్షించగలిగాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top