ఎగవేతదారులకు ‘బొమ్మ’ పడుద్ది..!

Name and shame programs in banks - Sakshi

ఫొటోలను పత్రికల్లో ప్రచురించండి...

బ్యాంకులను కోరిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు పెరుగుతుండటంతో వాటికి కళ్లెం వేసే దిశగా సంబంధిత ఖాతాదారుల ఫొటోలను పత్రికల్లో ప్రచురించడం ద్వారా దారికి వచ్చేలా చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ కార్యక్రమం కింద ఎగవేతదారుల ఫొటోలను ప్రచురించేందుకు బోర్డుల అనుమతి తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖలో సూచించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

ఇందుకు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించి బోర్డు అనుమతి పొందాలని కోరింది. చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నప్పుటికీ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని ఖాతాల సంఖ్య గత డిసెంబర్‌ నాటికి 9,063కు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల మొత్తం రూ.1,10,050 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఇటీవలే లోక్‌సభకు వెల్లడించారు.

నీరవ్‌ మోదీ స్కామ్‌ నేపథ్యంలో రూ.50 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్ట్‌ వివరాలను సమీకరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రం ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. పారదర్శక, బాధ్యతాయుత బ్యాంకింగ్‌ అన్నది తమ తదుపరి లక్ష్యమని, పాస్‌పోర్ట్‌ వివరాలు తీసుకోవడం ద్వారా మోసం బయటపడితే సత్వరమే చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఈ చర్య వెనుక ఉద్దేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top