మోదీకి మూడీస్‌ గుడ్‌న్యూస్‌

Moody's raises India's rating, hails GST - Sakshi - Sakshi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌కు రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తీపికబురు అందించింది. 13 సంవత్సరాల తర్వాత భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ సంస్కరణలకు కితాబిచ్చింది. వ్యవస్ధాగత సంస్కరణల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన మూడీస్‌ సంస్థ భారత్‌ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు సవరించింది. దేశ స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్‌ను పీ-3 నుంచి పీ-2కి మార్చింది. సంస్కరణల జోరుతో దేశంలో వాణిజ్య పరిస్థితి, ఉత్పాదకత మెరుగవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను సైతం స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌కు మార్చింది.

దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్‌టీని మూడీస్‌ ప్రశంసించింది. జీఎస్‌టీ అమలుతో అంతరాష్ర్ట వాణిజ్యానికి ఎదురవుతున్న అవరోధాలు తొలిగి ఉత్పాదకత మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే భారత్‌కున్న అధిక రుణ భారం దేశ పరపతి ప్రతిష్టకు ప్రతికూలమని ఆందోళన వ్యక్తం చేసింది.

సంస్కరణల వేగం పెరుగుతున్న రుణ భారం రిస్క్‌లను తగ్గించగలవని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పరిమితమవుతుందని మూడీస్‌ అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top