ఇక మార్కెట్లో షేర్ల డీలిస్టింగ్‌ వేవ్‌!

Market may seen Companies delisting wave - Sakshi

ఇప్పటికే 3 కంపెనీల సన్నాహాలు

వేదాంతా, అదానీ పవర్‌, హెక్సావేర్‌

ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు

త్వరలో యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఒరాకిల్‌?

దాదాపు దశాబ్ద కాలం తరువాత దేశీ స్టాక్‌ మార్కెట్లలో కార్పొరేట్లు కంపెనీల డీలిస్టింగ్‌వైపు దృష్టి పెడుతున్నారు. ఇటీవల గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పవర్‌, బిలియనీర్‌ అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ కంపెనీ వేదాంతా డీలిస్టింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ బాటలో ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సైతం స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ కానున్నట్లు తెలియజేసింది. కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు ఇందుకు ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క కంపెనీ సంబంధ అంశాలు సైతం ప్రమోటర్లను డీలిస్టింగ్‌వైపు నడిపిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇంతక్రితం 2009లో..
దశాబ్ద కాలం క్రితం అంటే 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తాక పతనమైన స్టాక్‌ మార్కెట్లు ఏడాది తిరిగేసరికల్లా రికవర్‌ అయ్యాయి. ఆ సమయంలో అంటే 2009లో పలు కంపెనీలు డీలిస్టింగ్‌కు మొగ్గు చూపాయి. తిరిగి గత రెండు నెలల్లో పబ్లిక్‌ వద్దగల వాటాను కొనుగోలు చేయడం ద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలను డీలిస్ట్‌ చేసేందుకు వేదాంతా, అదానీ పవర్‌, హెక్సావేర్‌ ప్రమోటర్లు ప్రణాళికలు ప్రకటించాయి. ఈ బాటలో దేశీ లిక్కర్‌ కంపెనీ యునైటెడ్‌ స్పిరిట్స్‌ను డీలిస్ట్ చేసే యోచనలో యూకే దిగ్గజం డియాజియో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఐటీ సేవల యూఎస్‌ దిగ్గజం ఒరాకిల్‌ సైతం ఇదే బాటలో నడవనున్నట్లు మార్కెట్లో అంచనాలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

సింగపూర్‌ బాటలో..
గత రెండేళ్లలో సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నుంచి పలు కంపెనీలు డీలిస్టింగ్‌ బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. 2017- 2019 జులై మధ్య కాలంలో కంపెనీల డీలిస్టింగ్‌, టేకోవర్ల కారణంగా పలు షేర్లు సగటున 15 శాతం ప్రీమియం సాధించినట్లు డీబీఎస్‌ బ్యాంక్‌ ఒక నివేదికలో పేర్కొంది. కాగా.. డీలిస్టింగ్‌ వేవ్‌పై అంచనాలతో ఇటీవల ఒక మ్యూచువల్‌ ఫండ్‌ ఇందుకు అవకాశాలున్న కౌంటర్లపై దృష్టిపెట్టినట్లు నిపుణులు ప్రస్తావించారు. కోవిడ్‌-19 ప్రభావంతో షేర్ల ధరలు దిగిరావడం, నగదు నిల్వలు పుష్కలంగా కలిగి ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొన్ని దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలు డీలిస్టింగ్‌పై చూపు సారించే అవకాశమున్నట్లు ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ నిపుణులు చొక్కలింగం ఈ సందర్భంగా వివరించారు. జనవరి- మే నెల మధ్యకాలంలో వేదాంతా,  అదానీ పవర్‌ కౌంటర్లు 40 శాతం వరకూ పతనమైన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top