బ్యాంకింగ్‌లో మరిన్ని సంస్కరణలు | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌లో మరిన్ని సంస్కరణలు

Published Mon, Feb 15 2016 5:06 AM

బ్యాంకింగ్‌లో మరిన్ని సంస్కరణలు - Sakshi

త్వరలోనే తగిన చర్యలు ప్రకటిస్తాం...
* ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హమీ
* పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగే పరిస్థితి లేదు

ముంబై: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడిఉందని.. త్వరలోనే ఈ దిశగా చర్యలు వెలువడతాయంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ను(ఫిబ్రవరి 29న) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటాలను పూర్తిగా విక్రయించే పరిస్థితులు ప్రస్తుతం భారత్‌లో లేవని ఆయన స్పష్టం చేశారు.

మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా ఆదివారమిక్కడ ‘సీఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరం-2016’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించే స్థాయికి భారత్ ఇంకా చేరుకోలేదు. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను(సమ్మిళిత ఆర్థికాభివృద్ధి) అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, వీటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా(ప్రొఫెషనల్) మార్చే ఉద్దేశంతోనే ప్రభుత్వ వాటాలను 51 శాతానికి తగ్గించుకోవాలని నిర్ణయించాం.

బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని జైట్లీ చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లు దేశీ బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక నష్టాలను(క్యూ3లో) ప్రకటించడం... ఐఓబీ, దేనా తదితర బ్యాంకులు తీవ్ర నష్టాల్లోకి జారిపోయిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారీ మొండిబకాయిలే పీఎస్‌యూ బ్యాంకుల లాభాలు హరించుకుపోయేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
 
జీఎస్‌టీపై త్వరలో సంప్రదింపులు...
కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్య సభలో ఆమోదింపజేసేందుకు త్వరలోనే ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతామని జైట్లీ చెప్పారు. దేశంలో స్థిరమైన పన్నుల వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోమారు స్పష్టం చేశారు. పన్నులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా దేశ ప్రతిష్టకు కొంత నష్టం వాటిల్లిందని కూడా ఆయన చెప్పారు.

ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఓకే కానీ..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరుపై జైట్లీ మరోసారి విమర్శలు గుప్పించారు. సంస్కరణలకు సంబంధించి నిర్ణయాల్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చాలా బాగా పనిచేశారని.. అయితే, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాత్రం సంస్కరణలు ఆగిపోయాయన్నారు. కాగా, ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడంలో మోదీ సర్కారు విఫలమైందని, కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ప్రతిపక్షాన్ని పూర్తిగా విస్మరిస్తోందంటూ మన్మోహన్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు.
 
ఇన్వెస్టర్ల గమ్యంగా భారత్..
ముంబై: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన దేశమని, ఇక్కడ అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని దేశీ, అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధలు తెలిపారు. వీరు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా వీక్’లో జరిగిన సీఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరమ్‌లో మాట్లాడారు. భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవ్వాలంటే యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సి ఉందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు.  ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇండియా వేగవంతమైన ఆవిష్కరణలతో ముందుకెళ్తోందని సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ తెలిపారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే అనువైన సమయమని, మంచి అవకాశాన్ని కోల్పోవద్దని చెప్పారు. సిస్కో తన తొలి తయారీ ప్లాంటును పుణేలో ఏర్పాటుచేసే అవకాశముందన్నారు. ఆవిష్కరణలకు అనువైన దేశమని జీఈ ప్రెసిడెంట్, సీఈవో (దక్షిణాసియా) బన్మాలి అగర్వాల్ తెలిపారు.
 
మేకిన్ ఇండియా వీక్ విశేషాలు
* డైవర్సిఫైడ్ గ్రూప్ ఐటీసీ కంపెనీ.. ఒడిశాలోని రూ.800 కోట్లమేర పెట్టుబడులు పెట్టనున్నది.
* పునరుత్పాదక ఇంధనం, రిటైల్, లాజిస్టిక్స్ వంటి తదితర రంగాలకు సంబంధించి దాదాపు రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. చైనాకు చెందిన వాండా గ్రూప్‌తో దాదాపు రూ.65,000 కోట్ల విలువైన ఎంఓయూ కుదిర్చుకున్నట్లు తెలిపింది.
* బౌద్ద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటామని మహరాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) పేర్కొంది.
* టాటా స్టీల్ అనుబంధ కంపెనీ ‘టాటా స్టీల్ సెజ్’ తాజాగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌లోని ఇండస్ట్రీయల్ పార్క్ సంబంధిత సెజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.2,000-రూ.2,500 కోట్లు వరకు ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
* ఒడిశాలో 3 ఎంటీపీఏ అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2-3 నెలల్లో తుది క్లియరెన్స్ పొందే అవకాశముందని ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.12,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement
Advertisement