
ముంబై: బంగారు ఆభరణాల డిమాండ్‌లో దీర్ఘకాలిక వృద్ధి రేటు 6–7 శాతం మేర ఉండవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ప్రజల ఆదాయాలు, వ్యవస్థీకృత రంగం బలపడుతుండడం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ అంచనాను వెల్లడించినట్టు తెలిపింది. పండుగలు, జనాభా పెరుగుదల మధ్యకాలానికి డిమాండ్ పెంచనున్నట్లు తాము నిర్వహించిన ఒక సర్వే ద్వారా వెల్లడైందని ఇక్రా వివరించింది.
గ్రామీణ ప్రాంతం నుంచి డిమాండ్
రుతుపవనాలు అనుకూలంగా ఉన్న కారణంగా గ్రామీణ ప్రాంతం నుంచి డిమాండ్ పెరుగుతుంది. 65 శాతం జనాభా పల్లెల్లోనే ఉండడం, వీరు బంగారు అభరణాలను ఒక సంప్రదాయ పెట్టుబడిగా భావిస్తుండడం డిమాండ్ పెరుగుదలకు మరో కారణంగా నిలవనున్నట్లు విశ్లేషించింది. గడిచిన ఏడాదికాలంలో బంగారం ధరలు 6 శాతం పెరిగి వినిమయ డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు తెలిపింది. నగదు లభ్యత తగ్గడం వల్ల ఈ పరిశ్రమ స్టోర్ల పెంపు ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది.