లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్... | Lohia Auto sees big potential for e-bikes in AP, Telangana | Sakshi
Sakshi News home page

లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్...

Published Thu, Apr 23 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్...

ఒకసారి చార్జింగ్‌తో 80 కి.మీ.
 
*  వాహనం ధర రూ. 1.20 లక్షలు
* లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న లోహియా ఆటో ఇండస్ట్రీస్ హమ్‌రాహి పేరుతో రూపొందించిన ఈ-రిక్షాలు జూన్‌కల్లా రోడ్లపై పరుగుతీయనున్నాయి. వీటి విక్రయానికై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్ ప్రభుత్వాల నుంచి కంపెనీ ఆమోదం పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దరఖాస్తు చేసుకున్నామని లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.

ఔత్సాహిక యువకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఫైనాన్స్ సౌకర్యాన్ని తొలుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆ కంపెనీ ఉత్సాహంగా ఉందని వివరించారు. పశ్చిమ, దక్షిణ భారత్‌లో వాహనాలను మార్కెట్ చేసేందుకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 50 డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
 
అయిదుగురు ప్రయాణించొచ్చు..: బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలో డ్రైవర్‌తోసహా అయిదుగురు ప్రయాణించొచ్చు. వాహన వేగం గంటకు 20 కిలోమీటర్లు. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు వెళ్లొచ్చు. వాహనం ధర రూ.1.20 లక్షలు. అదనపు బ్యాటరీకి రూ.25 వేలు అవుతుంది. బ్యాటరీ జీవిత కాలం 15 వేల కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. వాహనానికి ఆటోమోటివ్ రిసర్చ్ అసోసియేషన్(ఏఆర్‌ఏఐ) ధ్రువీకరణ ఉందని ఆయుష్ లోహియా వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ ప్లాంటులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిక్షాలతోపాటు డీజిల్ త్రీ వీలర్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. 2014-15లో ఇ-స్కూటర్లు 12 వేల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 20 వేల యూనిట్లు అంచనా వేస్తోంది. 2014-15లో దేశం లో ఈ-స్కూటర్లు సుమారు 35,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ-స్కూటర్‌కు రూ.9,400 వరకు కేంద్రం సబ్సిడీ ఇస్త్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement