స్థానిక సమాచారం కోసం గూగుల్‌ ‘నైబర్లీ’

local information on Google naibarli - Sakshi

రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సీనియర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ బెన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్థానిక సమాచారం కోసం చాలా సందర్భాల్లో ఇంటిదగ్గర వారిని సంప్రదిస్తాం. అదే వేరే ప్రాంతానికి వెళ్తే రోడ్డునపోయే అపరిచితులను అడగాల్సి వస్తుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో అడుగు ముందుకేసి ‘నైబర్లీ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఖాతా ఉన్న బ్యాంకు ఎస్‌బీఐ అనుకుందాం. ఏటీఎంకు వెళ్లాల్సి వస్తే.. ఎస్‌ఎంఎస్‌ లేదా వాయిస్‌ రూపంలో ‘దగ్గరలో ఎస్‌బీఐ ఏటీఎం ఎక్కడ ఉంది’ అని అడిగితే చాలు. నైబర్లీ యాప్‌ను వాడుతున్న అక్కడి ప్రాంతం వారు ఎస్‌ఎంఎస్‌ రూపంలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తారు. బాగా స్పందించే వారికి టాప్‌ నైబర్‌ స్టేటస్‌ ఇస్తారు. నోటిఫికేషన్ల పరిమితిని యూజర్లు సెట్‌ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా త్వరలో..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైజాగ్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. నేటి (శనివారం) నుంచి హైదరాబాద్‌లో పనిచేయనుంది. రెండు వారాల్లో దేశవ్యాప్తంగా నైబర్లీ సేవలను అందుకోవచ్చని గూగుల్‌ సీనియర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ బెన్‌ ఫోనర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నైబర్లీ యాప్‌ను భారత మార్కెట్‌ కోసం దేశీయంగా అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఇంగ్లిషుతోపాటు తెలుగు వంటి ఎనిమిది భారతీయ భాషల్లో యాప్‌ పనిచేస్తుంది. అవసరమైతే మరిన్ని స్థానిక భాషలను జోడిస్తాం. 15 లక్షల మందికిపైగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. భారతీయులది స్నేహపూర్వక మనస్తత్వం కాబట్టే తొలుత నైబర్లీని ఇక్కడ అమలులోకి తెచ్చాం. ఇతర దేశాలకు ఈ యాప్‌ను పరిచయం చేసే అవకాశమూ ఉంది’ అని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top