
హాంకాంగ్: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్.. మెజారిటీ వాటాలను కొనుగోలు చేసే అంశం మరింత జోరందుకుంది. ఈ జూన్ ఆఖరు నాటికల్లా డీల్ కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను మదింపు చేసిన వాల్‌మార్ట్.. 10–12 బిలియన్ డాలర్లకు 51 శాతం వాటాలను కొంటామంటూ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
డీల్ స్వరూపం ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఉన్నవారి వాటాలతో పాటు కొత్తగా మరిన్ని షేర్లను కూడా వాల్‌మార్ట్ కొనుగోలు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త షేర్లకు కట్టే రేటు ప్రకారం ఫ్లిప్‌కార్ట్ విలువ 18 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని పేర్కొన్నాయి. అదే పాత షేర్లకు ఆఫర్ చేసే ధర ప్రకారం చూస్తే 12 బిలియన్ డాలర్లుగా ఉంటుందని వివరించాయి.
షేర్ల విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ దూరం..
ప్రస్తుతమున్న షేర్లకు తక్కువ ధర లభించనున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు అయిదో వంతు వాటాలు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ తమ షేర్లను విక్రయించే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన టైగర్ గ్లోబల్, యాక్సెల్, నాస్పర్స్ మొదలైనవి మాత్రం తమ మొత్తం వాటాలు అమ్మేసేయొచ్చని సమాచారం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే, టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మొదలైనవి కూడా ఇన్వెస్ట్ చేశాయి. డీల్ ఇంకా ఖరారు కాలేదని, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, ఇన్వెస్టర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెజాన్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ నియంత్రణ సంస్థలపరమైన అభ్యంతరాలు తలెత్తవచ్చని ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు.
కార్యకలాపాల విస్తరణకు వాల్‌మార్ట్‌కు అవకాశం
ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన వాల్‌మార్ట్.. చాన్నాళ్లుగా భారత రిటైల్ మార్కెట్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది భారత్‌లో 21 హోల్‌సేల్ స్టోర్స్ నిర్వహిస్తోంది. ఒకవేళ ఫ్లిప్‌కార్ట్‌తో డీల్ సాకారమైతే వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఈ–కామర్స్ మార్కెట్లో వాల్‌మార్ట్ భారీ స్థాయిలో విస్తరించేందుకు తోడ్పడనుంది.
అలాగే, ప్రత్యర్ధి సంస్థ అమెజాన్‌కు కూడా గట్టి పోటీనివ్వడానికి ఉపయోగపడనుంది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్.. భారత ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నట్లు రీసెర్చ్ సంస్థ ఫారెస్టర్ అంచనా.