
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకొనేందుకు ఆపన్న హస్తాలు స్పందిస్తున్నాయి. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 700 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించించగా ఇటు దేశవ్యాప్తంగా చిన్నారులు సహా ప్రజలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేము సైతం సహాయాన్ని ప్రకటిస్తున్నారు. నగదు, ఆహారం, మందులు, దుస్తులు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. వీరితో పాటు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా మాతృదేశానికి వచ్చిన కష్టానికి స్పందిస్తున్నారు. తాజాగా అబుదాబీలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త స్పందించారు.
అబుదాబి కేంద్రంగా పనిచేసే వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థకు చైర్మన్ డా.షంషీర్ వయలిల్ కేరళకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన సొంత రాష్ట్రమైన కేరళకు 26 మిలియన్ దుబాయ్ దిర్హమ్‌లను (దాదాపు రూ.50 కోట్లు) కోట్లు విరాళం ఇచ్చారు. షంషీర్ వయలిల్ కు మధ్య ఆసియా, భారత్, యూరప్ లలో మొత్తం 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి. డాక్టర్ షంషీర్ వయలిల్, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కలిసి ఈ మొత్తాన్ని సమకూర్చి కేరళ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చినట్టు సమాచారం. షంషీర్ రూ.50 కోట్ల మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ప్రారంభించి ఈ రూ.50 కోట్లని బాధితుల పునరావాసం, ఆరోగ్యం, విద్యకు ఖర్చు చేయనున్నట్లు షంషీర్ తెలిపారు. వరదలకు తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు గత వందేళ్లలో సంభవించని వరద ముప్పుతో విలవిల్లాడిన కేరళం ప్రస్తుతం వర్షాలు ఉపశమించాయి. అయితే కూలిన ఇళ్లు, తెగిపడిన రోడ్లు, విరిగి పడిన చెట్లతో జనం కన్నీటి సంద్రమవుతున్నారు. కొద్దికొద్దిగా సహాయ శిబిరాల్లోతలదాచుకున్న ప్రజలు చెదరిని తమ గూళ్లను చక్కదిద్దకునే పనిలో ఉన్నారు. పరిస్థితి చక్కదిద్దిడానికి కొన్ని వారాల సమయం పడుతుందని, ప్రస్తుతం డాక్టర్లు, నర్సులు, వైద్య సహాయం అవసరం చాలా అవసరమని అధికారులు ప్రకటించారు.