ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు 

Investment in equity funds - Sakshi

ఇన్వెస్టర్లలో పెరుగుతున్న పరిపక్వత 

సిప్‌లపై నమ్మకమే దీనికి నిదర్శనం  

దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈక్విటీ ఎమ్‌ఎఫ్‌ల వైపు ఇన్వెస్టర్ల చూపు  

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ.10,585 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని ఆంఫి వెల్లడించింది. వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు,  కంపెనీల క్యూ1 ఫలితాలు బాగా ఉండడం దీనికి ప్రధాన కారణాలని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(ఆంఫి ) పేర్కొంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు విషయమై ఆంఫి వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... 

ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై క్వార్టర్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ.43,300 కోట్లకు పెరిగాయి.  ఫలితంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు 10 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు ఈ ఏడాది జూన్‌ క్వార్టర్‌కు రూ.8.3 లక్షల కోట్లకు ఎగిశాయి.  ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.12,409 కోట్లకు చేరాయి. ఈ పెట్టుబడులు మేలో రూ.12,070 కోట్లు, జూన్‌లో రూ.8,237 కోట్లు, జూలైలో రూ.10,585 కోట్లుగా ఉన్నాయి.   గత నెలలో ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల  పెట్టుబడులను ఫండ్స్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు.  స్వల్ప కాలిక పెట్టుబడుల సాధనాలైన ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్ల నుంచి రూ.31,000 కోట్ల  ఉపసంహరణ జరిగింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి రూ.7,950 కోట్ల మేర పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.  

ఈక్విటీ ఎమ్‌ఎఫ్‌ల్లో పెట్టుబడులు ఇందుకే....
గత కొన్నేళ్లుగా సగటు భారత ఇన్వెస్టర్లకు ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోందని ఇండియాబుల్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ హెడ్‌(ఈక్విటీ ఫండ్స్‌) సుమిత్‌ భట్నాగర్‌ చెప్పారు.  వ్యవస్థాగతంగా భారత్‌ పటిష్టమైన వృద్ధిని సాధించగలదని వారు విశ్వసిస్తున్నారని, అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారని వివరించారు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు పెరుగుతుండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. దీర్ఘకాలంలో రెండంకెల రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు లేకపోవడంతో, చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని వివరించారు.  లార్జ్‌ క్యాప్‌ కంపెనీ షేర్లలో బుల్‌ రన్‌ కొనసాగుతుండటంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని గ్రోడాట్‌ఇన్‌ సీఓఓ హర్ష జైన్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల నిర్వహణ ఆస్తులు రూ.23 లక్షల కోట్ల రేంజ్‌లో ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top