బీమా రంగంలో కొత్తగా 5వేల ఉద్యోగాలు!

insurers looking to hire about 5,000 people - Sakshi

లాక్‌డౌన్‌ అనంతరం ఊపందుకోనున్న నియామకాలు

జూన్‌ త్రైమాసికంలో వివిధ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు దాదాపు ఐదు వేల మందిని కొత్తగా నియమించుకోనున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం వ్యాపారం ఊపందుకుంటుందన్న అంచనాలతో అటు లైఫ్‌, ఇటు జనరల్‌ బీమా సంస్థలు నియామకాలకు సై అంటున్నాయి. ఈ త్రైమాసికంలో దాదాపు 1500 మందిని నియమించుకోవాలని పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ సిద్దమవుతోంది. ఏడాది చివరకు ఈ నియామకాలను 3వేలకు పెంచుకోవాలని భావిస్తోంది. కెనరా హెచ్‌ఎస్‌బీసీ, ఓబీసీ లైఫ్‌ సంస్థలు చెరో వెయ్యిమందిని నియమించుకునే యత్నాల్లో ఉన్నాయి. టాటా ఏఐజీసంస్థ సైతం కొత్తగా వెయ్యిమందిని, టాటా ఏఐఏ లైఫ్‌ కొత్తగా 500 మందిని నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఇప్పటికే 300 నియామకాలు చేపట్టిన రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ మరో 400 మందిని రిక్రూట్‌ చేసుకునేందుకు తయారైంది.

కరోనా సంక్షోభానంతరం బీమా తీసుకునేవాళ్లు పెరుగుతారని కంపెనీలు భావించి తదనుగుణంగా నియామకాలు చేపడుతున్నాయని టీమ్‌లీజ్‌ రిక్రూటింగ్‌ సంస్థ అధిపతి అజయ్‌ షా అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఈ రంగంలో చోటుచేసుకున్న కొత్త కలయికలు, విలీనాలతో ఉద్యోగాలు పెరగనున్నాయన్నారు. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు ఆరంభమై, వేతన జీవులకు సమయానికి జీతాలు వచ్చే పరిస్థితులు నెలకొంటే ముందుగా బీమా ఉత్పత్తుల వైపు చూస్తారని ఎక్కువమంది ఇన్స్యూరెన్స్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రజలకు తమ ఆరోగ్యాలు, తమవారి జీవితాలపై శ్రద్ధ పెరగడం బీమా రంగం మరింత దూసుకుపోయేందుకు దోహదం చేస్తాయంటున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top