నేడు కృత్రిమ మేథ (ఏఐ) వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ప్రతి ఒక్క పనికి ఏఐ చాట్‌బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చాలా తేలిగ్గా, తక్కువ వ్యయంతో అధిక సమర్థతతో పనిచేస్తున్నాయి. నలుగురు చేయాల్సిన పని ఒక్కరితోనే పూర్తవుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలో సమర్థత పెంపులో ఏఐ నైపుణ్యం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది. ఏఐ వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పని విధానాలను సమూలంగా మార్చివేస్తోంది. పని ప్రదేశాన్నే కాదు జీవన విధానాలనే మార్చివేస్తున్న కృత్రిమ మేథ నైపుణ్యం.. తాజా సర్వేల్లో టాప్ స్కిల్‌గా నిలుస్తోంది.
ఏఐ స్కిల్ ఉన్న నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. కృత్రిమ మేథపై పట్టున్న వారికి లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటంలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ పరంగా ఏఐ కీలక నైపుణ్యంగా మారింది.
మరింత విస్తరణ దిశగా
మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు డేటా కేంద్రాలు, ఏఐ మౌలిక వసతులపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఏఐ రంగం మరింతగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలు అదే స్థాయిలో చేపట్టనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో జాబ్ మార్కెట్‌లో కృత్రిమ మేథ కీలకమైన నైపుణ్యంగా మారనుంది.
తాజా నివేదిక అంచనాలు
ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్–2025’ ప్రకారం.. అన్ని రంగాలను డిజిటల్ టెక్నాలజీ కమ్మేయనుంది. 2030 నాటికల్లా తమ వ్యాపారాలు పూర్తిగా డిజిటల్‌గా మారతాయని భావిస్తున్నట్లు 60 శాతం మంది పేర్కొనడం విశేషం. అత్యాధునిక సాంకేతికత ముఖ్యంగా ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 86 శాతం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 58 శాతం, ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 41 శాతం డిజిటల్ మార్పులకు కారణం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో ఏఐ, బిగ్‌డేటా, నెట్‌వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.
డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో.. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్‌లు, బిగ్ డేటా స్పెషలిస్ట్‌లు, ఫిన్‌టెక్ ఇంజనీర్స్, సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ డవలపర్స్, అటానమస్ అండ్ ఈవీ స్పెషలిస్ట్‌లు తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంటుందని తాజా పేర్కొంది. మరోవైపు క్లరికల్, సెక్రటేరియల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా క్యాషియర్స్, టికెట్ క్లర్క్స్, డేటా ఎంట్రీ క్లర్క్స్, బ్యాంక్ టెల్లార్ కొలువుల్లో కోతపడనుంది.
అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతున్న నైపుణ్యాల్లో ఏఐ అండ్ బిగ్ డేటా టాప్‌లో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్‌వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ లిటరసీ నిలిచాయి. ఈ మూడు టెక్ నైపుణ్యాలతోపాటు 2025–2030 మధ్యకాలంలో సృజనాత్మక ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) ఒత్తిళ్లను తట్టుకొనే సామర్థ్యం (రెజిలియెన్స్), సరళత్వం-చురుకుదనం (ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ), కుతూహలం (క్యూరియాసిటీ), జీవితాంతం నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న వారికి కంపెనీలు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
నిపుణుల కొరత
ఏఐ నిపుణుడిగా మారాలంటే.. ఐఐటీల్లో చదవాలి, టాప్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్‌లు ఉండాలి అనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
ఓ వైపు ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేరని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మానవ వనరుల నైపుణ్యాలు, కంపెనీల అవసరాల మధ్య తీవ్ర అంతరం నెలకొంది. ఏఐ నిపుణుల కొరత తీర్చేందుకు పెద్ద ఎత్తున అప్‌స్కిల్లింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు.
ఏఐ రంగంలో ప్రవేశించాలనుకునే వారు వ్యక్తిగతంగా స్వీయ అసెస్‌మెంట్ చేసుకోవాలి. జాబ్ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా తమలో నైపుణ్యాలు లేకుంటే వాటిని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మొదట యూట్యూబ్ తదితర ఆన్‌లైన్ మార్గాల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత బేసిక్ ఆన్‌లైన్ షార్ట్‌టర్మ్ కోర్సుల ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. స్వయం, ఎన్‌పీటీఈఎల్ తదితర మార్గాల ద్వారా ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ అందిస్తున్న ఉచిత కోర్సుల ద్వారా ఏఐపై పట్టు పెంచుకొని జాబ్ మార్కెట్‌లో అవకాశాల కోసం అన్వేషించొచ్చు!!
ఇదీ చదవండి: డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!


