‘నేటి డిజిటల్ యుగంలో.. మేనేజ్‌మెంట్ రంగంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా క్యాంపస్ ఆఫర్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కాబట్టి మేనేజ్‌మెంట్ విద్యార్థులు టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది’ అంటున్నారు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్–బెంగళూరు డైరెక్టర్ (ఇన్‌ఛార్జ్) ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్. ఐఐటీ–ముంబైలో పీహెచ్‌డీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేసి.. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపక రంగంలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దినేశ్ కుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
మేనేజ్‌మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం గురించి చెప్పండి?
ఫైనాన్స్, హెచ్‌ఆర్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏఐ ప్రధాన్యం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే కీలకమైన రికార్డ్స్ నిర్వహణ, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత కార్యకలాపాలు మొదలయ్యాయి. మన దేశంలోనూ బిగ్ డేటా, డేటా అనలిటిక్స్‌లో ఏఐ ప్రమేయం ఎక్కువగా ఉంది. మిగతా విభాగాల్లోనూ రానున్న రోజుల్లో ఇది కనిపిస్తుంది. దీంతో మేనేజ్‌మెంట్ పీజీ విద్యార్థులు అకడమిక్‌గా టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.
బిజినెస్ స్కూల్స్ ఏఐకు సంబంధించిన బోధన పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి డిమాండ్ నెలకొన్న ఏఐ టూల్స్‌ను గుర్తించాలి. విద్యార్థులకు సదరు ఏఐ నైపుణ్యాలు అందించేలా పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేయాలి. ఐఐఎం–బెంగళూరు మూడేళ్ల క్రితమే ఎస్‌ఏపీ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఏఐ ఫర్ మేనేజర్స్ పేరుతో 16 నెలల లాంగ్‌టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీనిద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నైపుణ్యాలతోపాటు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ లభిస్తాయి.
మేనేజ్‌మెంట్ విద్యార్థులకు సలహా?
అందుబాటులోని సీట్ల సంఖ్య, పోటీ కారణంగా కొద్దిమందికే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి–స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపై దృష్టి సారించాలి. ఇక కోర్సులో అడుగు పెట్టాక.. విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్‌రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.
నియామకాల్లో ఏఐ నైపుణ్యాలపై కంపెనీల దృక్పథం ఎలా ఉంది?
కంపెనీలు సహజంగానే లేటెస్ట్ స్కిల్స్‌పై అవగాహన ఉన్న వారి కోసం అన్వేషణ సాగిస్తాయి. కొన్ని కంపెనీలు.. ఏఐ కార్యకలాపాలు నిర్వహించగలిగే వారిని గుర్తించి వారికి శిక్షణనిచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తాజాగా ఐఐఎం– బెంగళూరు సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో బీసీజీ, బెయిన్ అండ్ కో, టీసీఎస్ వంటి సంస్థలు ఏఐ సంబంధిత విభాగాల్లో ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేశాయి.
విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా దేశంలో సదుపాయాలు ఉన్నాయా?
వాస్తవానికి దేశంలో స్టార్టప్స్ కోణంలో గత పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా గత అయిదారేళ్ల కాలంలో స్టార్టప్‌ల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయం ఉపాధి గురించి ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చక్కటి వ్యాపార ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు.
స్టార్టప్స్ ఏర్పాటు కోసం అకడమిక్ స్థాయి నుంచే అడుగు వేయాల్సిన అవసరం ఉందా?
అకడమిక్ స్థాయిలో స్టార్టప్స్‌కు సంబంధించిన నైపుణ్యాలను బోధించడం వల్ల విద్యార్థులకు థియరీ నాలెడ్జ్ ఏర్పడుతుంది. కాని క్షేత్ర స్థాయిలో అడుగు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులతో తమ వ్యాపార ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గ నిర్దేశం విద్యార్థులకు లభిస్తుంది.
ఇటీవల కాలంలో డేటా అనలిటిక్స్ జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ పెరగడానికి కారణమేంటి?
విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఎండ్ యూజర్స్ వరకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల పట్ల ఆదరణ ఎలా ఉంది.. సమస్యలు ఏమిటి.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం బిగ్ డేటా అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతోంది. అందుకే బిగ్‌డేలా నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ నెలకొంది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యేక కోర్సుగా రూపొందడమే దీనికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.
మేనేజ్‌మెంట్ విద్యార్థులు అకడమిక్స్‌తోపాటు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి?
మేనేజ్‌మెంట్ విద్యార్థులు అకడెమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితమవడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా కలిగుండాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు కేవలం క్లాస్ రూం లెక్చర్స్‌కే పరిమితం కాకుండా.. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా దృష్టి సారించాలి. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనేవి తరగతి బోధనతోనే లభించవు. వీటిని ప్రతి విద్యార్థి సొంతంగా క్షేత్రస్థాయి ప్రాక్టీస్ ద్వారా అందిపుచ్చుకోవాలి.
మేనేజ్‌మెంట్ పీజీలో ఇప్పటికీ టెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష విధానమే కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం– బెంగళూరులో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, హ్యుమానిటీస్ అభ్యర్థులు.. ఇలా విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు చదువుతున్నారు. క్యాట్ అనేది సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ కంటే విద్యార్థుల ఆలోచన శైలి కీలకంగా నిలుస్తుంది.


