తొలిసారి రూ.3 లక్షల కోట్లకు చేరిన ఇన్ఫోసిస్‌

Infosys Tops Rs 3 Lakh Crore M-Cap For First Time - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం దూసుకెళ్లాయి. 5 శాతానికి పైగా ర్యాలీ జరిపి ఆల్‌-టైమ్‌ గరిష్ట స్థాయిలను తాకాయి. ఇన్ఫీ తన తొలి త్రైమాసిక ఫలితాల్లో బోనస్‌లు జారీ చేయడంతో ఆ కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 1:1 రేషియోలో ఈక్విటీ షేర్లపై బోనస్‌ను జారీ చేసింది.  ఇన్ఫీ షేరు స్టాక్‌ మార్కెట్‌లో నమోదై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాటాదార్లకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మరో బోనస్‌ షేరు(1:1 నిష్పత్తి)ను ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు ఉదయం ఇన్ఫీ షేరు ధర 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లను చేరింది. 

బీఎస్‌ఈ ఇంట్రాడేలో ఇన్ఫీ షేరు ధర 5.75శాతం పెరిగి రూ.1384.4 వద్ద ఆల్‌-టైమ్‌ గరిష్టాన్ని చేరుకున్న సమయంలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ మేర పెరిగింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్‌ ధర 5శాతం పెరిగి ఏడాది గరిష్ఠానికి చేరింది. ఆ అనంతరం చివరికి 1.41 శాతం లాభంలో రూ.1,336 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్‌ అతిపెద్ద గెయినర్‌గా నిలిచింది. మొత్తం 1.29 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ట్రేడయ్యాయి. సోమవారం కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌కు రూ.17,114 కోట్లు జతయ్యాయి.  శుక్రవారం ముగింపు రోజు ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,85,924 కోట్లగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 టాప్‌ పర్‌ఫార్మెర్స్‌లో ఇన్ఫోసిస్‌లో ఒకటి. 

కాగ, గత వారం విడుదలైన ఇన్ఫీ క్వార్టర్‌ ఫలితాలు స్ట్రీట్‌ అంచనాలకు అనుగుణంగానే నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌-జూన్‌లో ఇన్ఫీ ఏకీకృత నికర లాభం 3.7శాతం వృద్ధి చెంది రూ.3,612కోట్లకు చేరింది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం 12% పెరిగి రూ.17,078కోట్ల నుంచి రూ.19,128కోట్లకు చేరింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top