ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

IndiGo promoters finally call a truce - Sakshi

ఇండిగో ప్రమోటర్ల మధ్య  రాజీ

గంగ్వాల్‌ డిమాండ్లకు ఇండిగో బోర్డు ఆమోదం

ఈ వార్తలతో పుంజుకున్న ఇండిగో షేరు

సాక్షి, ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటార్ల వివాదానికి తెరపడినట్టు తెలుస్తోంది.  ప్రధాన విభేదాలు పరిష్కరించుకనే దిశగా ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌  సుముఖంగా ఉన్నట్టు సమాచారం.  వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇరువురు కృషి చేస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  దీనిపై సీఎన్‌బీసీతో మాట్లాడుతూ  కొనసాగుతున్న బోర్డు చర్చలపై వ్యాఖ్యానించడానికి  గంగ్వాల్ ఇష్టపడలేదు. అయితే ,తాము సమస్యలను పరిష్కరించగలమని ఆశిస్తున్నానన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

జూలై 19, 20 తేదీలలో  రెండు రోజుల జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక రాజీ కుదిరింది. ముఖ్యంగా గంగ్వాల్‌ ప్రధాన డిమాండ్‌  బోర్డు విస్తరణ. మరింతమంది ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను చేర్చుకోవాలని, వీరిలోఒక మహిళా  ఉండాలన్న గంగ్వాల్‌ డిమాండ్‌ ఇండిగో బోర్డు ఆమోదించింది. నలుగురు స్వతంత్ర డైరెక్టర్లతో సహా బోర్డును గరిష్టంగా పదిమందికి విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్  సవరించనున్నారు. ఈ సవరణ రాబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి  ఉండనుంది. 

మరోవైపు ఈ వార్తలు  స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లను బాగా ఉత్సాహపర్చింది. బేర్‌ మారెట్‌లో ఇండిగో కౌంటర్‌లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో 2 శాతం లాభాలతో ఇండిగో ఎట్రాక్టివ్‌గా ఉంది. కాగా ఇండిగో సంస్థలో కార్పోరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని గంగ్వాల్‌ సెబీకి జులై 9న లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండిగోలో  గంగ్వాల్ 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top