క్యూ2లో తగ్గనున్న వృద్ధి జోరు?

India's Q2 GDP growth rate seen slowing to 7.5-7.6% - Sakshi

ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా

అధికారిక గణాంకాలు శుక్రవారం

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–2019) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) మందగించే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ తెలిపింది. గ్రామీణ డిమాండ్‌ మందగమనం తమ అంచనాలకు కారణమని పేర్కొంది. వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 7.6 శాతం శ్రేణిలో నమోదయ్యే వీలుందని వివరించింది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) స్థూల దేశీయోత్పత్తి 8.2 శాతం. శుక్రవారం అధికారిక గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ  రీసెర్చ్‌ తాజా అంచనాలు వెలువడ్డాయి.  మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

∙సెప్టెంబర్‌ త్రైమాసికంలో వాణిజ్య వాహన అమ్మకాలు, దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య, సిమెంట్‌ ఉత్పత్తి రంగాలు రెండంకెల్లో వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. 
∙రెండవ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వల్ల వృద్ధి విషయంలో ఈ ప్రతికూలత స్పష్టంగా కనబడనుంది.  
∙ఆహారేతర రుణం, బ్యాంకు డిపాజిట్లు అలాగే పాసింజర్, కమర్షియల్‌ వాహన అమ్మకాల అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో తగ్గే అవకాశం ఉంది.  

ఇక్రా కూడా ఇదే చెబుతోంది... 
రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా కూడా అంచనా వేసింది. ఈ రేటు దాదాపు 7.2 శాతంగా నమోదయ్యే వీలుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మందగమనం దీనికి కారణమని పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసే మూడు నెలల కాలంలో పారిశ్రామిక రంగం వృద్ధి 10.3 శాతం నుంచి 7.1 శాతానికి పడే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.  ప్రత్యేకించి తయారీ రంగం వృద్ధి రేటు 13.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గే వీలుందని అంచనావేసింది. ఇక వ్యవసాయ రంగంలో వృద్ధి స్పీడ్‌ కూడా 5.3 శాతం నుంచి 3.5 శాతానికి  పడుతుందని అంచనావేసింది. సేవల రంగంలో వృద్ధి మాత్రం 7.3 శాతం నుంచి 7.8 శాతానికి పెరగవచ్చని అభిప్రాయపడింది.  అయితే అధిక కమోడిటీ ధరల వల్ల మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌ రంగం 0.1 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. క్రూడ్‌ అధిక ధర, డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు తగ్గడానికి కారణంగా అభిప్రాయపడింది. ఇక కొన్ని ప్రాంతాల్లో తగిన వర్షపాతం నమోదుకావడం మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలతో పంట నష్టం వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా మారుతోందని విశ్లేషించింది.

2018–19లో ద్రవ్యలోటు పెరగచ్చు: ఇండియా రేటింగ్స్‌
కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2018–19) ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అదుపుతప్పే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. జీడీపీలో ద్రవ్యలోటు 3.3%  ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యంకాగా, ఇది 3.5%కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. అంటే బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఇది 6.24 లక్షల కోట్లయితే, రూ.6.67 లక్షల కోట్లకు పెరిగే వీలుందని ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది.  పరోక్ష పన్నులు, పన్ను యేతర ఆదాయాలు తగ్గే అవకాశాలు ఉండడం తమ అంచనాలకు కారణంగా విశ్లేషించింది. సెప్టెంబర్‌ వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ద్రవ్యలోటు రూ.5.94 లక్షలుగా ఉంది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 95 శాతం స్థాయి. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top